జీసీసీ దేశాల నుంచి వచ్చే నిధులపై ప్రభావం
కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెరగొచ్చు
క్రిసిల్ రేటింగ్స్ అంచనాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత్‌కు వచ్చే రెమిటెన్స్ ప్రవాహం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల నుంచి వచ్చే మొత్తం రెమిటెన్స్‌ల్లో సుమారు మూడో వంతు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుంచే వస్తుందని పేర్కొంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఈ ప్రవాహం మందగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాస భారతీయుల ఆదాయాలు తగ్గితే కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వాణిజ్య లోటు ఒత్తిడిలో ఉన్న సమయంలో రెమిటెన్స్ తగ్గుదల ఆర్థిక సమతౌల్యంపై మరింత ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ప్రవాసుల నుంచి రెమిటెన్స్‌లు అత్యధికంగా పొందుతున్న దేశంగా భారత్ ప్రపంచంలో ముందంజలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఈ రూపంలో 135 బిలియన్ డాలర్లకు పైగా వచ్చాయి.
ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడి
పశ్చిమాసియా ఘర్షణల కారణంగా గ్లోబల్ వాణిజ్య ప్రవాహాల్లో అంతరాయం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల భారత ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. అయితే అమెరికా సుంకాలు తగ్గడం కొంతమేర మద్దతు ఇస్తుందని పేర్కొంది. మరోవైపు ముడి చమురు ధరలు సంవత్సరానికి 8–9% పెరగడం వల్ల దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. లాజిస్టిక్ సమస్యలు, సరఫరా గొలుసు పునర్‌వ్యవస్థీకరణ కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు ప్రభావితమవుతున్నాయని తెలిపింది.
ఎగుమతులు ఇలా
జీసీసీ దేశాలకు భారత్ 57 బిలియన్ డాలర్లు (మొత్తం ఎగుమతుల్లో 13%), ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు 9 బిలియన్ డాలర్లు (2%) ఎగుమతులు చేసింది. బాస్మతి బియ్యం (70% పైగా), బోవైన్ మీట్ (30%), సిరామిక్ ఉత్పత్తులు (25%), పెట్రోలియం ఉత్పత్తులు (15%), రత్నాలు – ఆభరణాలు (20%) వంటి ఉత్పత్తుల్లో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఉందని నివేదిక వెల్లడించింది. రవాణా సమస్యలు, సరఫరా విధానాల్లో మార్పుల కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు తగ్గడం లేదా ఆలస్యం కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు


