సామాన్యుడి విమాన ప్రయాణంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల ఏవియేషన్ రంగానికి సవాలుగా మారుతోంది. దాంతో ఇటీవల విమానయాన సంస్థలు ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల పెరుగుదల, దాని పర్యవసానాలపై విమానయాన సంస్థలతో చర్చలు జరిపేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.
విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా కేవలం ఇంధనానిదే. అందుకే ఏటీఎఫ్ ధరల్లో స్వల్ప మార్పు వచ్చినా అది టికెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల సవరణల తర్వాత ధరల వ్యత్యాసం ఇలా ఉంది.
| విభాగం | పాత ధర (కిలోలీటరుకు) | ప్రస్తుత ధర (కిలోలీటరుకు) |
|---|---|---|
| ఇంటర్నేషనల్/చార్టర్డ్ | రూ. 96,638.14 | రూ. 2,07,341.22 (దాదాపు రెట్టింపు) |
| దేశీయ కార్యకలాపాలు | - | రూ. 1,04,927.18 |
ప్రభుత్వం విమానయాన రంగానికి వెసులుబాటు కల్పిస్తూ 25 శాతం వరకు పెంపునకు అనుమతించినప్పటికీ దేశీయ ప్రయాణీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రభావాన్ని 8.5 శాతానికి పరిమితం చేయాలని భావించింది.
ఇండిగో దూకుడు..
ప్రభుత్వ అధికారిక ఆదేశాలు రాకముందే దేశీయ దిగ్గజం ఇండిగో ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చేలా ఇంధన సర్‌ఛార్జీలను సవరించింది. అయితే, గతంలో ఉన్న రూ.425 ఫ్లాట్ ఛార్జీని తొలగించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి రూ.275 నుంచి రూ.950 వరకు దేశీయ మార్గాల్లో సర్‌ఛార్జీని నిర్ణయించింది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వారికి కొంత ఉపశమనం లభించనుంది. అంతర్జాతీయ రూట్లలో ముఖ్యంగా యూరప్ వంటి సుదూర ప్రాంతాలకు ఇంధన సర్‌ఛార్జీ ఏకంగా రూ.10,000 వరకు పెరగడం గమనార్హం.
ప్రభుత్వ జోక్యం
ధరల పెరుగుదలపై విమానయాన సంస్థల నుంచి కేంద్రం వివరణ కోరుతోంది. ‘ధరల పట్ల సున్నితంగా ఉండే భారతీయ మార్కెట్‌లో ఇంధన ధరల భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపడం సరైనది కాదు’ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రం ఇంకా ఎటువంటి అధికారిక నియంత్రణ ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, త్వరలో జరగబోయే చర్చల ద్వారా అదనపు సర్‌ఛార్జీలను ఉపసంహరించుకోవాలని లేదా కనీసం పునసమీక్షించాలని సంస్థలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు


