న్యూఢిల్లీ: పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల నేపథ్యంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి ఎగిశాయి. ఏకంగా రూ. 29.53 లక్షల కోట్ల విలువ చేసే 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
గతేడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 26.84 లక్షల కోట్ల విలువ చేసే 2,039 కోట్ల లావాదేవీలు రికార్డయ్యాయి. డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయనడానికి ఇది నిదర్శనమని పేనియర్‌బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్ తదితర ఏడు దేశాల్లో ఇది అందుబాటులో ఉంది.


