పర్యాటకం పట్టాలెక్కేనా?

Travel Industry Has BIG Expectations From Union Budget 2021-22 - Sakshi

బడ్జెట్‌పై ఈ రంగం ఎన్నో ఆశలు

కరోనా కారణంగా భారీ నష్టాలతో సతమతం

పన్నులు తగ్గించి, నిధులు పెంచాలి

దేశీ పర్యటనలకు ప్రోత్సాహకాలివ్వాలి

జీఎస్‌టీని 5%కి తగ్గించాలి పరిశ్రమ వర్గాల వినతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ చర్యలతో ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం (టూరిజం), ఏవియేషన్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కరోనా భయంతో ప్రజలు ముఖ్య అవసరాలు మినహాయించి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు తొలి నాళ్లలో సుముఖత చూపలేదు. దీంతో గడిచిన ఏడాది కాలంలో పర్యాటక రంగం భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 1న ప్రకటించే బడ్జెట్‌లో కచ్చితంగా తమను ఒడ్డెక్కించే చర్యలు ఉంటాయని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.

రూ.1.25 లక్షల కోట్ల నష్టం..  
కరోనా కారణంగా పర్యాటక రంగం ఒక్కటే 2020లో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టపోయినట్టు కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పర్యాటక రంగంపై 50 శాతం ప్రభావం పడగా.. మార్చిలో 70 శాతానికి పెరిగింది. ఇదే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్‌ నుంచి జూన్‌ కాలంలో పర్యాటక రంగం రూ.69,400 కోట్ల మేర నష్టపోయిందని కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం నష్టాలుగా పేర్కొంది. ఈ రంగం తిరిగి సాధారణ స్థితికి రావాలంటే రెండేళ్లు పడుతుందని అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పరిశ్రమను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పలు చర్యలను ప్రకటించొచ్చని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశిస్తున్నాయి.  

పరిశ్రమ డిమాండ్లు..
► దేశీయంగా చేసే పర్యటనలపై ఆదాయపన్ను మినహాయింపును ఇవ్వాలన్న డిమాండ్‌ను పర్యాటక రంగం ఈ విడత కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్‌టీ నమోదిత టూర్‌ ఆపరేటర్లు, ఏజెంట్లు, హోటళ్ల సేవల కోసం రూ.1.5 లక్షల వరకు ఖర్చుపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. టూరిజమ్‌ పరిశ్రమ జీడీపీలో 6.23 శాతం వాటాతో ప్రముఖ పాత్ర పోషిస్తూ.. 8.78 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్‌ సంస్థలు, ఏవియేషన్, ఆతిథ్యం ఇవన్నీ టూరిజమ్‌ పరిశ్రమ కిందకే వస్తాయి.
► ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వాలని, జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలి.  
► గడిచిన 10–12 నెలల కాలంలో దెబ్బతిన్న డిమాండ్‌ను పునరుద్దరించేందుకు తగినన్ని నిధులు కేటాయించి.. కష్టాల నుంచి బలంగా బయటపడేందుకు, డిమాండ్‌ పెంచేందుకు ప్రభుత్వం సహకరించాలి.  
►  ఆర్థిక వ్యవస్థ చురుగ్గా మారాలంటే వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందుకు దీర్ఘకాలిక

మూలధన లాభాల పన్నును ఎత్తివేయాలి.  
► ఎంఎస్‌ఎంఈ మూలధన నిధుల రుణాలను పర్యాటక రంగానికీ విస్తరించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు సహకరించాలి.  
► రుణాల వడ్డీపై వెసులుబాట్లు, రుణ చెల్లింపులపై మారటోరియం కల్పించాలి.  
►  ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలి. ఎయిర్‌పోర్ట్‌ చార్జీలపై లెవీలను, ల్యాండింగ్, నేవిగేషన్‌ చార్జీలను కూడా తగ్గించాలి.
► లాక్‌డౌన్‌లను ఎత్తేసి, ప్రయాణాలపై ఆంక్షలు తొలగించిన అనంతరం పర్యాటక రంగంలో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. వైరస్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతూ వస్తుండడం, మరోవైపు టీకాల కార్యక్రమం కూడా మొదలైనందున రానున్న నెలల్లో మంచి వృద్ధి ఉంటుందని ఈ రంగం అంచనా వేస్తోంది. ప్రభుత్వపరమైన సహకారం తోడైతే తాము మరింత వేగంగా పురోగమించొచ్చని భావిస్తోంది.

ఆతిథ్య రంగాన్ని ముందుగా ఒక పరిశ్రమగా గుర్తించాలి. అద్దె ఇళ్ల విధానాన్ని తీసుకురావాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము. పరిశ్రమ ఎంత వేగంగా పుంజుకుంటుందన్నది ప్రభుత్వ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది.  
– కృష్ణ కుమార్, సీఈవో, ఇస్తారా పార్క్స్‌

2022 నాటికి దేశీయంగా 22 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. ఇందులో భాగంగా పర్యాటక రంగానికి వెన్నెముకగా నిలిచే హోటళ్లకు ప్రభుత్వం పూర్తి మద్దతునివ్వాలి. ఎంఎస్‌ఎంఈ వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలను టూరిజమ్‌ పరిశ్రమకూ ఇవ్వాలి. ఎల్‌టీసీజీని వెనక్కి తీసుకోవాలి.
– రోహిత్‌ వారియర్, వారియర్‌ సేఫ్‌ సీఈవో

వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు దేశీయ పర్యాటక రంగానికి మేలు చేస్తుంది.
–దీప్‌కల్రా,మేక్‌మైట్రిప్‌ వ్యవస్థాపకుడు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top