హైదరాబాద్‌లో పోడియం పార్కింగ్‌ !

Telangana Government Gave Permission To Podium Parking In Hyderabad - Sakshi

నూతన సదుపాయంతో భవన నిర్మాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

బిల్డింగ్‌ రూల్స్‌కు సవరణలు..ఉత్తర్వుల జారీ

హైదరాబాద్‌ బిల్డర్లు, డెవలపర్లకు సువర్ణాశకాశం  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో పోడియం పార్కింగ్‌కు కూడా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భవన నిర్మాణ నియమావళి (జీవో నం.168)కు ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్, ఆపై కొన్ని ఫ్లోర్లను పార్కింగ్‌ అవసరాలకు తగ్గట్లు నిర్మించుకుని, ఆ తర్వాతి ఫ్లోర్లను నివాస/కమర్షియల్‌ అవసరాల కోసం నిర్మించుకోవడానికి పోడియం పార్కింగ్‌ రూల్స్‌ వీలు కల్పించనున్నాయి. దీంతో అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్, పోడియం పార్కింగ్‌ రెండింటిలో ఏదో ఒక పార్కింగ్‌ సదుపాయాన్ని ఎంపిక చేసుకుని నిర్మాణాలు చేపట్టడానికి బిల్డర్లు, డెవలపర్లకు అవకాశం కలిగింది. 

అండర్‌ గ్రౌండ్‌పై నిషేధం లేదు
రాష్ట్రంలో అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ను నిషేధించలేదని, కొత్తగా పోడియం పార్కింగ్‌ రూల్స్‌ను మాత్రమే అమల్లోకి తెచ్చినట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ రెండు పార్కింగ్‌ సదుపాయాల్లో ఏదో ఒక దాన్ని బిల్డర్లు, డెవలపర్లు ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 

పోడియం పార్కింగ్‌ రూల్స్‌
పోడియం ఫ్లోర్‌ గరిష్ట ఎత్తు 15 మీటర్లు ఉండాలి. భవన నిర్మాణ నియమావళి, అప్రోచ్‌ రోడ్డు వైశాల్యం ఆధారంగా భవనం ఎత్తు ఉండాలి. పదెకరాలకు పైబడిన స్థలంలో నిర్మించే భవనాల్లో తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ పోడియం ఫ్లోర్లు ఉండాలి. భవనం ఎత్తు, సెట్‌ బ్యాక్స్‌ లెక్కించే సమయంలో పోడియం ఫ్లోర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించారు.

పోడియం సెట్‌బ్యాక్స్‌...
- 55 మీటర్ల వరకు ఎత్తు గల భవనం విషయం లో 12 మీటర్ల టర్నింగ్‌ రేడియస్‌తో 7 మీటర్ల సెట్‌ బ్యాక్‌ తప్పనిసరి. రెండు పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్‌ డ్రైవ్‌ అవే) 7 మీటర్లు ఉండాలి. 
- 55 మీటర్లకు మించి ఎత్తు కలిగిన భవనాల విషయంలో 14 మీటర్ల టర్నింగ్‌ రేడియస్‌తో 7 మీటర్ల సెట్‌బ్యాక్‌ తప్పనిసరి. పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్‌ డ్రైవ్‌ అవే) 9 మీటర్లు ఉండాలి. 
- పోడియంపై ఉండే భవనం సెట్‌ బ్యాక్‌లు బిల్డింగ్‌ రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. పోడియానికి వదిలిన సెట్‌బ్యాక్‌ను సైతం భవనం సెట్‌బ్యాక్‌లో భాగంగా పరిగణిస్తారు. 
- పోడియం ఫ్లోర్లను అనుమతిస్తే బేస్‌మెంట్‌/సెల్లార్‌ ఫ్లోర్ల సంఖ్యపై ఆంక్షలు ఉంటాయి. కమర్షియల్‌ భవనాల విషయంలో మూడు బేస్‌ మెంట్, నివాస భవనాల విషయంలో రెండు బేస్‌ మెంట్స్‌ మాత్రమే అనుమతిస్తారు. 
- పోడియం సెట్‌బ్యాక్‌లకు సమాన రీతిలో బేస్‌ మెంట్స్‌ సెట్‌బ్యాక్స్‌ ఉండాలి. 
- పోడియంపై టాట్‌–లాట్‌ అనుమతిస్తారు.  
- భవనం 10 వేల చదరపు మీటర్లలోపు ఫ్లోర్‌ ఏరియా మాత్రమే కలిగి ఉంటే కనీసం మూడో వంతు భవనంతో పాటు భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునేలా భవనం చుట్టూ సెట్‌బ్యాక్స్‌ ఉండాలి. 
- భవనం 10వేల చదరపు మీటర్లకు పైగా ఫ్లోర్‌ ఏరియా కలిగి ఉంటే కనీసం సగభాగం భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునే విధంగా సెట్‌బ్యాక్స్‌ ఉండాలి.  
- పోడియం ఫ్లోర్లను ప్రత్యేకంగా పార్కింగ్‌ కోసమే వినియోగించాలి. అయితే, విజిటర్స్‌ లాబీలు, డ్రైవర్ల కోసం వేయిటింగ్‌ రూమ్స్, టాయిలెట్ల సదుపాయాన్ని కల్పించవచ్చు. విజిటర్స్‌ లాబీల కోసం గరిష్టంగా 2%, డ్రైవర్లకు సదుపాయాల కోసం గరిష్టం 10 శాతం ఫ్లోర్‌ ఏరియాను మాత్రమే వినియోగించాలి.  
- రోడ్డుకు వెళ్లే మార్గం, పోడియం మధ్య ఎలాంటి గోడలు ఉండరాదు.  ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తీసుకున్నాక పోడియం పార్కింగ్‌ కోసం కేటాయించిన స్థలాన్ని వేరే అవసరాల కోసం దుర్వినియోగం చేస్తే, ఆ స్థలాలను సంబంధిత పురపాలిక జప్తు చేసుకుని తన పేరు మీద రిజిస్టర్‌ చేసుకుంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top