
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1FY26) ఫలితాలను వెల్లడించింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి రూ.12,760 కోట్లకు చేరుకుంది. లాభం అంచనాలను మించి వచ్చింది. టీసీఎస్ ఏప్రిల్-జూన్ నికర లాభం వృద్ధి స్వల్పంగా 1.9 శాతంతో రూ.12,263 కోట్లకు పరిమితమతుందని విశ్లేషకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.
ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.63,437 కోట్లకు చేరుకుందని భారత అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ తెలిపింది. ఇది బ్లూమ్బర్గ్ ఏకాభిప్రాయ అంచనా రూ.64,636 కోట్ల కంటే తక్కువ.
డివిడెంట్ ప్రకటన
రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.11 మధ్యంతర డివిడెండ్ ను టీసీఎస్ ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ ను 2025 ఆగస్టు 4వ తేదీ కంపెనీ ఈక్విటీ వాటాదారులకు చెల్లిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు కోసం లబ్ధిదారులను నోట్ చేసుకోవడానికి సంస్థ జూలై 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది.
కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు వరుసగా పెరిగాయి. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈబీఐటీ మార్జిన్ 30 బేసిస్ పాయింట్లు పెరిగి 24.5 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు డిమాండ్ క్షీణతకు కారణమయ్యాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ తెలిపారు.
2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొత్తగా 6,071 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. దీంతో మొత్తం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 2025 జూన్ 30 నాటికి 6,13,069కి చేరింది. కంపెనీ ఐటీ సేవల అట్రిషన్ రేటు (గత పన్నెండు నెలల ప్రాతిపదికన) తొలి త్రైమాసికంలో 13.8 శాతానికి పెరిగింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతంగా ఉండేది. టీసీఎస్ కు టాలెంట్ డెవలప్ మెంట్ కీలకమని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. టీసీఎస్ ఇప్పుడు 1,14,000 మంది హై ఆర్డర్ ఏఐ స్కిల్స్ ఉన్నవారు ఉండటం సంతోషకరమన్నారు.
ఆదాయ ప్రకటనకు ముందు టీసీఎస్ షేరు ధర 0.4 శాతం లాభంతో రూ.3,397.1 వద్ద ముగిసింది.