పెట్టుబడులు పెట్టాలా ? ఎందులో, ఎప్పుడు, ఎలా..

Stock Market Investment Tips By Experts - Sakshi

ప్రపంచమంతటా మార్కెట్లు కాస్త గందరగోళంగా ఉన్నాయి. అయితే, మిగతా సంపన్న, వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌ మాత్రం కాస్త మెరుగ్గానే ఉంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయులకు చేరిందని, గ్లోబల్‌ మార్కెట్లు స్వల్పకాలికం నుండి మధ్యకాలికంగా కాస్త సానుకూలంగా ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, పరిస్థితులు కనిపిస్తున్నంత ఆశావహంగా ఏమీ లేవు. ఎందుకంటే 2023–24లోనూ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం ఈక్విటీలపైనా కనిపించనుంది.

ఈ నేపథ్యంలో ఈ రెండింటి ప్రభావం ఎక్కువగా ఉండని సాధనాల మీద ఇన్వెస్టర్లు దృష్టి పెడితే ప్రయోజనకరంగా ఉండవచ్చు. పటిష్టమైన నిర్వహణ నైపుణ్యాలు, భారీ డిమాండ్‌ ఉండే రంగాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. వాటి తయారీ సంస్థలు దీర్ఘకాలిక లాభదాయకత దెబ్బతినకుండా తమ ఉత్పాదనల తయారీ, వ్యయాలు మొదలైన వాటిని సులభంగానే సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే ఆయిల్, ఇంటరీ్మడియరీ రసాయనాల ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావం పడినా.. భారతీయ రసాయన రంగ సంస్థలకు అంతర్జాతీయంగా డిమాండ్‌పరమైన దన్ను లభించవచ్చు. పటిష్టమైన ధరల విధానం, మంచి డిమాండ్‌ గల ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు.. కాస్త రేట్లు పెంచినా నిలదొక్కుకోగలవు.  

సర్వీస్‌ కంపెనీలు..
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి సర్వీస్‌ ఆధారిత కంపెనీలు, రంగాలపై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం అంతగా ఉండదు. అధిక వేల్యుయేషన్లు, మాంద్యం రిసు్కల భయాలతో 2022లో గణనీయంగా కరెక్షన్‌కి లోనైన ఈ తరహా సంస్థలపై దృష్టి పెట్టవచ్చు. భారీ వేల్యుయేషన్‌లు, బలహీన నగదు ప్రవాహాలు ఉన్న కొత్త తరం టెక్‌ కంపెనీల్లో స్వల్పకాలికంగా ఒడిదుడుకులు ఉండవచ్చు. ఒక మోస్తరు వేల్యుయేషన్, పటిష్టమైన బ్యాలెన్స్‌ షీటు గల ఇన్ఫీ, టీసీఎస్, టెక్‌ మహీంద్రా వంటి పూర్తి ఐటీ కంపెనీలు మెరుగ్గా ఉంటాయి. రుణరహితమైనవి లేదా రుణభారం తక్కువగా ఉండి, వడ్డీ రేట్ల ప్రభావానికి లోను కాని కంపెనీలు.. మార్కెట్‌ను మించి రాబడులు అందించగలవు.

తయారీ రంగ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు వర్తించే రంగాల ఆశావహంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పర్యావరణ అనుకూల ఇంధనం, 5జీ, ఇథనాల్, డిఫెన్స్‌ మొదలైన పరిశ్రమలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. అయితే, పనితీరు స్థాయి, వేల్యుయేషన్‌లతో ఆయా కంపెనీలు ఎంత మేర లబ్ధి పొందగలవనేది పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలి. వీటిలో చాలా మటుకు సంస్థల వేల్యుయేషన్‌ ఎక్కువగానే ఉంటోంది. ఇక, సైక్లికల్స్‌ అయిన మెటల్స్, ఇన్‌ఫ్రా, ఆయిల్‌.. మైనింగ్‌ రంగాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అలాగే అంతర్జాతీయ వ్యాపారాల్లోను పెట్టుబడులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం శ్రేయస్కరం. 

స్మాల్‌ క్యాప్స్‌ ఆకర్షణీయం.. 
2022లో బాగా కుదేలైన స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ దీర్ఘకాలిక ప్రాతిపదికన పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లు కోలుకుని దీర్ఘకాలిక సగటు వేల్యుయేషన్‌ స్థాయుల్లో ట్రేడవుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ షేర్లు సగటుకు మించి ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన దేశంగా భారత్‌ నిలుస్తోంది.

దేశీ నిఫ్టీ50 సూచీ .. ఎస్‌అండ్‌పీ 500తో పోలిస్తే 20 శాతం, ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌తో పోలిస్తే 100 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. మిగతా సంపన్న, వర్ధమాన మార్కెట్లు కోలుకునే కొద్దీ స్వల్ప, మధ్యకాలికంగా భారత్‌ ఆకర్షణీయత కాస్త తగ్గవచ్చు. ఏది ఏమైనా.. విలువ గల షేర్లను, తగ్గినప్పుడు కొనుగోలు చేయడమనేది భవిష్యత్‌ పెట్టుబడులకు ప్రధాన సూత్రంగా ఉండాలి. ఎకానమీ మందగిస్తుండటం, వడ్డీ ఈల్డ్‌లు ఆకర్షణీయంగా మారుతున్న నేపథ్యంలో ఒక మోస్తరు రిస్కు తీసుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీకి 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే సమతూక విధానాన్ని పాటించవచ్చు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top