మ్యూచువల్‌ ఫండ్స్‌: ‘సిప్‌’ ఇన్వెస్టర్లకు షాక్‌! | SIP Reality Check Why Long Term Perspective is Key to Wealth Creation | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌: ‘సిప్‌’ ఇన్వెస్టర్లకు షాక్‌!

Mar 30 2026 1:45 PM | Updated on Mar 30 2026 1:59 PM

SIP Reality Check Why Long Term Perspective is Key to Wealth Creation

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో పెట్టుబడులు పెడుతున్న వారికి మార్కెట్‌ పనితీరు షాక్‌ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే గడిచిన ఏడాది, రెండేళ్ల కాలంలో వీటిల్లో రాబడి లేకపోగా, నష్టాలు మిగిలాయి. ముఖ్యంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో సిప్‌ పెట్టుబడులపై 48 శాతం వరకు నష్టపోయినవి ఉన్నాయి. 556 పథకాలను పరిశీలించగా, వీటిల్లో 486 నికర నష్టాలను ఇవ్వగా, 70 పథకాలు ఎంతో కొంత లాభాలను పంచాయి.  

విదేశీ ఫండ్స్‌లో లాభాలు.. 
ముఖ్యంగా గత కొంత కాలంలో దేశీ పథకాలు నష్టాలను మిగల్చగా, అంతర్జాతీయ ఫండ్స్‌ రాబడులు కురిపించాయి. ఇందులో క్వాంట్‌ టెక్‌ ఫండ్, మోతీలాల్‌ ఓస్వాల్‌ డిజిటల్‌ ఇండియా ఫండ్‌ సైతం ఉన్నాయి.  

కారణాలు ఎన్నో.. 
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై రాబడులకు గ్యారంటీ లేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక పరిణామాలకు అనుగుణంగా ఈక్విటీలు ర్యాలీ చేస్తుంటాయి. దిద్దుబాటుకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో దీర్ఘకాలం పాటు దిద్దుబాటు దశలోకి వెళ్లొచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే కోలుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్మాల్, మిడ్‌క్యాప్‌లో ఎక్కువ దిద్దుబాటు కనిపిస్తుంటుంది. కనుక స్వల్పకాలానికి ఈక్విటీలు అనుకూలం కాదు. మధ్య, దీర్ఘకాలానికే వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నది నిపుణుల సూచన.

కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయినా సరే ఐదేళ్లలోనే రాబడులు వస్తాయని చెప్పలేం. అనుకోకుండా మార్కెట్లు ఐదేళ్లపాటు దిద్దుబాటు, స్థిరీకరణ దశలోకి వెళితే రాబడులు లేకపోగా, నష్టాలూ ఎదురుకావొచ్చు. లంప్‌సమ్‌ అయినా, సిప్‌ అయినా రాబడులు/నష్టాలు మార్కెట్‌ గమనంపైనే ఆధారపడి ఉంటాయి. కనీసం 7–10 ఏళ్ల కాలంలో ఈ ప్రతికూలతలను అధిగమించి మెరుగైన రాబడులు అందుకోవచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 

ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? 
రాబడుల వెంట పరుగెత్తకుండా, గడిచిన ఏడాది కాల రాబడులను అనుసరించకుండా ఎంపిక చేసుకున్న పథకాల్లో సిప్‌ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను వైవిధ్యం చేసుకునేందుకు ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌కు సైతం కొంత కేటాయించుకోవాలన్నది సూచన. అంతర్జాతీయంగా ఏఐ, టెక్‌ ఫండ్స్‌కు లేదా చైనా, యూఎస్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని జెడ్‌ఫండ్స్‌ సీఈవో మనీష్‌ కొతారి పేర్కొన్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఫండ్స్‌ మంచి పనితీరు వెనుక ఏఐ, టెక్‌ అంశాలున్నాయని చెప్పారు. సిప్‌ను కేవలం 2–3 ఏళ్ల కాలానికి చూడొద్దన్నారు. దీర్ఘకాలంలో మార్కెట్‌ అస్థిరతలను అధిగమించి, సంపద సృష్టించుకునేందుకు రూపొందించిన సాధనం సిప్‌ అని చెప్పారు. కనీసం 10–15 ఏళ్ల కాల దృష్టితో చూడాలన్నారు. అంతర్జాతీయ ఫండ్స్‌కు 10–20 శాతం మేర పెట్టుబడులు కేటాయించుకోవచ్చని, ముఖ్యంగా యూఎస్‌ మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement