చిన్నచిట్కాలు.. ఇవి కరెంట్‌ బిల్లుల్ని తగ్గిస్తాయని తెలుసా?

Simple Power Saving Tips to Reduce Electricity Bills at Home Telugu - Sakshi

Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్‌లతో సంబంధం లేకుండా కరెంట్‌ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్‌ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!.  అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్‌ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్‌ చిట్కాలే!.

వ్యాంపైర్‌ అప్లియెన్సెస్‌..

కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్.  కాబట్టే వీటికి వ్యాంపైర్‌ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి కూడా. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ల మొదలు..  వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్‌లు, ఐరన్‌బాక్స్‌లు, వాషింగ్‌మెషీన్‌, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్‌ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్‌.  

సంబంధిత కథనం: ఆఫ్‌ చేసినా ఇవి కరెంట్‌ లాగేస్తాయని తెలుసా?

కెపాసిటీకి తగ్గట్లు.. 

వాషింగ్‌ మెషిన్‌, గ్రీజర్‌-వాటర్‌ హీటర్‌, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్‌ ఏవి వాడినా కరెంట్‌ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు వాషింగ్‌ మెషిన్‌ను ఫుల్‌ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం.  దీనివల్ల ఫుల్‌ కెపాసిటీ టైంలో పడే లోడ్‌ పడి కరెంట్‌ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్‌ మెషిన్‌లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్‌ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం.
 
ఇక కొత్తగా అప్లియెన్సెస్‌ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్‌ కన్‌జంప్షన్‌ తగ్గుతుంది. 

కరెంట్‌ సేవింగ్‌లో ఇదే ముఖ్యం


బల్బులు, సీలింగ్‌ ఫ్యాన్‌లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్‌ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్‌ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్‌ఎఫ్‌, ఎల్‌ఈడీ బల్బులు సైతం ఆఫ్‌ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్‌ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్‌ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్‌. 

పాతవి ఎక్కువే.. 

పాత అప్లియెన్సెస్‌.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్‌. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్‌ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి. 

మాటిమాటికీ అక్కర్లేదు.. 

మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, దోమల బ్యాట్లు, ఛార్జింగ్‌ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్‌ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్‌ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్‌ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్‌లను తొలగించాలి మరిచిపోవద్దు. 

కరెంట్‌ బిల్లులు మోగిపోవడానికి, మీటర్‌ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్‌ పాటిస్తూ కరెంట్‌ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top