
నేడు (14న) దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,329 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,323 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. గురువారం యూఎస్ మార్కెట్లు 0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దీంతో నేడు కూడా దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరికి అక్కడక్కడే
గురువారం సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి బలహీనపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 59 పాయింట్లు తక్కువగా 38,310 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8 పాయింట్లు నీరసించి 11,300 వద్ద నిలిచింది. అయితే తొలుత సెన్సెక్స్ 38,517 వరకూ ఎగసింది. మధ్యాహ్నం నుంచీ అమ్మకాలు పెరగడంతో 38,215కు వెనకడుగు వేసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,359 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,270 వద్ద కనిష్టాన్ని చేరింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,261 పాయింట్ల వద్ద, తదుపరి 11,221 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,350 పాయింట్ల వద్ద, ఆపై 11,399 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,077 పాయింట్ల వద్ద, తదుపరి 21,958 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,378 పాయింట్ల వద్ద, తదుపరి 22,559 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 416 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 764 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 351 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 940 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.