సెన్సెక్స్‌ @ 59,000

Sensex hits 59,000 for first time - Sakshi

17600పై ముగిసిన నిఫ్టీ 

సూచీలకు మూడోరోజూ లాభాలే

బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఇంధన షేర్లలో కొనుగోళ్లు

ఇన్వెస్టర్ల సంపద @ రూ.260 లక్షల కోట్లు

స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ దూకుడు కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో గురువారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఆయా రంగాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించాయి. ఐటీసీ, రిలయన్స్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌  తదితర లార్జ్‌క్యాప్‌ షేర్లు లాభపడి సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. సెన్సెక్స్‌ తొలిసారి 59,000 శిఖరాన్ని అధిరోహించి 417 పాయింట్ల లాభంతో 59,141 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 481 పాయింట్లు ర్యాలీ చేసి 59,204 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ ఇంట్రాడేలో 125 పాయింట్లు ర్యాలీ చేసి 17,645 వద్ద కొత్త తాజా గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసేసరికి 110 పాయింట్ల లాభంతో 17,629 వద్ద నిలిచింది. గడచిన మూడురోజుల్లో సెన్సెక్స్‌ 963 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లను ఆర్జించాయి. ఐటీ, మెటల్, మీడియా షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1622 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.168 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ రెండు పైసలు బలహీనపడి 73.52 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.

బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సంబంధించిన వార్తతో బ్యాంకింగ్‌ షేర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్లు రాణించడంతో ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఐదున్నర శాతం, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3%, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ రెండుశాతం ర్యాలీ చేశాయి.   

రెండోరోజూ టెలికం షేర్ల లాభాల మోత  
టెలికాం రంగానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినేట్‌ తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగ షేర్లు రెండురోజూ రాణించాయి. వోడాఫోన్‌ ఇంట్రాడేలో 28 శాతం లాభపడి రూ.11.47 స్థాయికి చేరింది. చివరికి 26 శాతం లాభంతో రూ.11.25 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ట్రేడింగ్‌లో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.744 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి ఒకశాతం శాతంతో రూ.718 వద్ద స్థిరపడింది.

మార్కెట్‌ క్యాప్‌లో ఐదో స్థానానికి భారత్‌
సూచీలు వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్‌ మార్కెట్లో రూ.4.46 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టస్థాయి రూ.260 లక్షల కోట్లకు చేరింది. విలువపరంగా భారత స్టాక్‌ మార్కెట్‌  ప్రపంచంలోనే ఐదోస్థానానికి చేరినట్లు బీఎస్‌ఈ సీఈవో అశిష్‌ చౌహాన్‌ తెలిపారు.

సన్సార్‌ ఐపీఓకు మంచి స్పందన...
ఆటో ఉపకరణాల తయారీ సంస్థ సన్సార్‌ ఇంజనీరింగ్‌ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరిరోజు నాటికి 11.47 రెట్ల సబ్‌స్రై్కబ్షన్‌ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా... 13.88 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 26.47 రెట్లు, నాన్‌ – ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ కేటగిరీలో 11.37 రెట్లు, రిటైల్‌ విభాగంలో 3.15 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి.  ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.382 కోట్లను సమీకరించింది.

సెపె్టంబర్‌ 21న పరాస్‌ డిఫెన్స్‌ ఐపీఓ
పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఐపీఓ సెపె్టంబర్‌ 21న ప్రారంభం కానుంది. ఇదే నెల 23న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు.

సెన్సెక్స్‌ 57వేల నుంచి 58వేల స్థాయికి చేరేందుకు మూడురోజుల ట్రేడింగ్‌ సమయాన్ని తీసుకోగా.., 58 వేల నుంచి 59 వేల స్థాయికి చేరుకొనేందుకు ఎనిమిది ట్రేడింగ్‌ సమయాన్ని తీసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top