Sebi: షేర్ల క్రయ, విక్రయాల్లో సవరణలు చేసిన సెబీ...!

Sebi Cuts Lock In Period For Promoters To 18 Months Post IPO - Sakshi

ప్రమోటర్‌ షేర్లకు తగ్గిన లాకిన్‌ 

మూడేళ్ల నుంచి 18 నెలలకు గడువు కుదింపు 

వాటా కొనుగోళ్లు, విక్రయాలలో సడలింపులు 

గ్రూప్‌ కంపెనీల ఆర్థిక వివరాలు 

వెబ్‌సైట్‌లలో పలు నిబంధనలు సవరిస్తూ సెబీ నోటిఫికేషన్లు 

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీల ప్రమోటర్ల పెట్టుబడులు, వాటాల విక్రయం, కొనుగోళ్లు తదితర అంశాలలో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సవరణలు చేపట్టింది. దీనిలో భాగంగా పబ్లిక్‌ ఇష్యూల తదుపరి ప్రమోటర్ల వాటాలపై లాకిన్‌ కాలపరిమితిని 18 నెలలకు తగ్గించింది. ప్రస్తుతం మూడేళ్ల లాకిన్‌ నిబంధనలు అమలవుతున్నాయి. ఇటీవల సెకండరీ మార్కెట్‌ దూకుడు కారణంగా ప్రైమరీ మార్కెట్‌ సైతం జోరందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలు కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సవరణలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వీటితోపాటు గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి వెల్లడించాల్సిన కొన్ని అంశాలపైనా నిబంధనలను క్రమబద్ధీకరించింది. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పలు తాజా నిబంధనలు ఈ నెల 13 నుంచీ అమల్లోకి వచ్చాయి. (చదవండి: ఆపిల్‌ కంపెనీకి భారీ షాక్‌..!)

20 శాతం వాటా.. 
ఒక ప్రాజెక్టుకు పెట్టుబడి వ్యయాల కోసంకాకుండా ఓఎఫ్‌ఎస్‌ లేదా ఫైనాన్సింగ్‌ కోసం పబ్లిక్‌ ఇష్యూ చేపడితే.. ప్రమోటర్ల నుంచి కనీసం 20 శాతం కంట్రిబ్యూషన్‌ ఉండాలి. అలాట్‌మెంట్‌ సమయం నుంచి 18 నెలల గడువు దీనికి వర్తిస్తుంది. ప్రస్తుతం మూడేళ్ల కాలపరిమితి అమలవుతోంది. పెట్టుబడి వ్యయాల పద్దుకింద సివిల్‌ పనులు, మిస్‌లేనియస్‌ ఫిక్స్‌డ్‌ ఆస్తులు, భూమి కొనుగోలు, భవనాలు, ప్లాంట్‌ మెషినరీ తదితరాలు వస్తాయి.

20 శాతానికి పైబడిన వాటా విషయంలో ప్రస్తుతమున్న 12 నెలల కాలపరిమితిని ఆరు నెలలకు సెబీ కుదించింది. ఐపీవోకు ముందు సెక్యూరిటీస్‌ కొనుగోలు చేసే ప్రమోటరేతర వ్యక్తులకు సైతం లాకిన్‌ గడువు ప్రస్తుతం అమలవుతున్న 12 నెలల నుంచి ఆరు నెలలకు పరిమితంకానుంది. ఇక గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి ఐపీవో సమయంలో వెల్లడించవలసిన అంశాలపైనా సెబీ నిబంధనలు క్రమబద్ధీకరించింది. గ్రూప్‌లోని టాప్‌–5 లిస్టెడ్‌ లేదా అన్‌లిస్టెడ్‌ సంస్థల ఆర్థిక సమాచారాన్ని ఆఫర్‌ డాక్యుమెంట్‌లో పొందుపరచవలసిన అవసరం ఉండదు. వీటిని కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచితే సరిపోతుంది. 

ప్రయివేట్‌ కంపెనీలకు.. 
సెబీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఐపీవోను చేపట్టే ప్రయివేట్‌ రంగ కంపెనీలు అధీకృత సంస్థ లేదా కార్పొరేషన్‌ లేదా ఏ ఇతర ఎస్‌పీవీ ద్వారా అన్ని గ్రూప్‌ కంపెనీల కార్యాలయ వివరాలను ఆఫర్‌ డాక్యుమెంట్‌లో వెల్లడించవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా ఐసీడీఆర్‌ నిబంధనలను సెబీ సవరించింది. వీటికి ఈ నెల మొదట్లో సెబీ బోర్డు ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. ఇక కంపెనీల కొనుగోళ్లు లేదా ప్రమోటర్ల మార్పిడి విషయంలో వెల్లడించవలసిన అంశాలపై సెబీ కొన్ని ప్రత్యేక నిబంధనలను తొలగించింది. వ్యవస్థీకృత వెల్లడి(ఎస్‌డీడీ) అమలు నేపథ్యంలో టేకోవర్‌ నిబంధనలను సవరించింది.

తాజా నిబంధనల ప్రకారం కొనుగోలుదారులు లేదా ప్రమోటర్లు షేర్ల కొనుగోలు లేదా అమ్మకం విషయంలో 5 శాతం వరకూ, ఆపై మరో 2 శాతం వరకూ ఫిజికల్‌గా వెల్లడించవలసిన అవసరం ఉండబోదు. ఇది 2022 ఏప్రిల్‌1 నుంచి అమల్లోకి రానుంది. ఇలాంటి లావాదేవీల విషయంలో స్టాక్‌ ఎక్సే్ఛంజీలు డిపాజిటరీల నుంచే స్వయంగా డేటాను పొందేందుకు వీలుంటుంది.  

లిస్టింగ్‌ అంశాలపై ఇలా..: లిస్టింగ్, వెల్లడించవలసిన అంశాలపైనా సెబీ విడిగా మార్గదర్శకాలను సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్పిడి రహిత రుణ సెక్యూరిటీలు, మార్పిడికి వీలులేని రిడీమబుల్‌ ఫ్రిఫరెన్స్‌ షేర్లు, పర్పెచ్యువల్‌ రుణ సెక్యూరిటీలు లేదా పర్పెచ్యువల్‌ నాన్‌క్యుమిలేటివ్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల లిస్టింగ్‌ విషయంలో నిబంధనలు సరళీకరించింది. తద్వారా పారదర్శకత పెంపు, క్రమబద్ధీకరణ, అనవసర ప్రొవిజన్లు ఎత్తివేడంతో కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌కు జోష్‌ లభించే వీలుంది. మార్పిడికి వీలుకాని సెక్యూరిటీలకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లను లిస్టెడ్‌ కంపెనీలు ఇన్వెస్టర్లకు ఈమెయిల్స్‌ ద్వారా పూర్తి స్థాయిలో సాఫ్ట్‌ కాపీల రూపంలో అందించవలసి ఉంటుంది.  

కొత్త టెక్‌ సంస్థలకు 
ఆవిష్కర్తల(ఇన్నోవేటర్స్‌) వృద్ధి ప్లాట్‌ఫామ్‌(ఐజీపీ) ద్వారా ఆధునిక టెక్నాలజీ కంపెనీలు జారీ చేసే స్వెట్‌ ఈక్విటీ నిబంధనలను సైతం సెబీ తాజాగా సరళీకరించింది. కొంతకాలంగా పలు స్టార్టప్‌లు విదేశాల నుంచి సైతం భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. ఐజీపీ లిస్టెడ్‌ కంపెనీలకు స్వెట్‌ ఈక్విటీ షేర్ల వార్షిక పరిమితి 15 శాతంగా అమలుకానుంది. మొత్తం గా 50 శాతంవరకూ వీటికి వీలుంటుంది. కంపె నీ ఆవిర్భవించిన పదేళ్ల కాలంలో ఇది వర్తించనుంది. మెయిన్‌బోర్డ్‌లో లిస్టెడ్‌ కంపెనీలకు ఈ షేర్ల వార్షిక పరిమితి 15 శాతంకాగా.. మొత్తం 25 శాతంవరకూ జారీకి వీలుంది. కాగా.. షేర్ల ఆధారిత ఉపాధి లబ్ది, స్వెట్‌ ఈక్విటీ నిబంధనలను ఈ సందర్భంగా సెబీ ఒక్కటిగా మార్చింది.

సాధారణంగా కంపెనీలు నగదేతర లావాదేవీకింద స్వెట్‌ ఈక్విటీని జారీ చేస్తాయి. స్టార్టప్‌లు, ప్రమోటర్లు.. వీటి ద్వారా కంపెనీలకు నిధులు అందించేందుకు వినియోగిస్తుంటారు. వాటాదారుల అనుమతితతో ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ సంబంధ ఉద్యోగులకు స్వెట్‌ ఈక్విటీని జారీ చేస్తుంటాయి. వీసీఎఫ్‌లు తదితర ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్, స్టాక్‌ ఎక్సే్ఛంజీలు తదితర మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు సంబంధించిన నిబంధనలను కూడా సెబీ తాజా గా సవరించింది. తద్వారా బిజినెస్‌ నిర్వహణ, నిబంధనల అమలును సులభతరం చేసింది. 

(చదవండి:ఈ మొబైల్‌ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, డిస్నీ హట్‌స్టార్‌ ఉచితం..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top