Russia Ukraine War: భారీ డిస్కౌంట్‌కు రష్యా ఆయిల్‌ 

Russian Oil Companies Offer Big Discounts To India - Sakshi

భారత్‌కు 25 శాతం తక్కువలో ఆఫర్‌  

బ్రెంట్‌ క్రూడ్‌ ధరకంటే చౌక

రుపీ–రూబుల్‌ వాణిజ్య ఖాతా! 

ప్రస్తుతం రష్యా– ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధ వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ముడిచమురు, పసిడి తదితర కమోడిటీల ధరలు మండుతున్నాయి. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్బణ సెగతో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌సహా పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దులో రష్యా సైనిక దళాలను మోహరించడం ప్రారంభించాక ఊపందుకున్న ముడిచమురు ధరలు నిలకడగా పెరుగుతూ వచ్చాయి.

లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ముందురోజు 139 డాలర్లను దాటగా.. ప్రస్తుతం 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం చరిత్రలోనే తొలిసారి 77 వద్ద ముగిసింది. దీంతో దేశీ దిగుమతులు బిల్లు తడిసిమోపెడు కానుంది. అయితే రష్యా తాజాగా 25–27 శాతం డిస్కౌంట్‌ ధరలో భారత్‌కు ముడిచమురు అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం.. 

మూడో ర్యాంకులో 
ప్రపంచ దేశాలలో భారత్‌ చమురు దిగుమతులకు మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఒమన్, దుబాయ్, బ్రెంట్‌ చమురును 75:25 నిష్పత్తిలో కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి నామమాత్ర స్థాయిలోనే (మొత్తం దిగుమతుల్లో దాదాపు ఒక శాతం) చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే బ్రెంట్‌ ధరలు తాజాగా 14ఏళ్ల గరిష్టానికి చేరడంతో రష్యా 25–27 శాతం డిస్కౌంట్‌ ధరలో చమురు సరఫరాకు ఆఫర్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

గతేడాది డిసెంబర్‌లో రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌ దేశీ పర్యటనకు వచ్చిన సందర్భంలో పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), రష్యా ప్రభుత్వ ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ మధ్య ఒప్పందం కుదిరింది. అత్యంత భారీ స్థాయిలో ఇండియాకు చమురు సరఫరాలు చేయగల రాస్‌నెఫ్ట్‌.. 2022 చివరికల్లా 2 మిలియన్‌ టన్నులమేర సరఫరా చేసేందుకు అంగీకరించింది.

స్విఫ్ట్‌ ఎఫెక్ట్‌...
రష్యా చమురు సరఫరాలకుగాను చెల్లింపుల విషయంలో ఇప్పటికింకా స్పష్టతలేనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్‌ ఆచితూచి వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా బ్యారల్‌కు 11.6 డాలర్ల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ దేశాలు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్‌ నుంచి పలు రష్యన్‌ బ్యాంకులను నిషేధించిన కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌సహా బ్యాంకింగ్‌ వర్గాలు ప్రత్యామ్నాయ చెల్లింపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు రుపీ–రూబుల్‌ వాణిజ్య ఖాతాను యాక్టివేట్‌ చేయడం ఒక ఆప్షన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2020–21లో ఒపెక్‌ దేశాల నుంచి ఇండియా 196.5 మిలియన్‌ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా క్రూడ్‌ ధరలు బ్యారల్‌కు 185 డాలర్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top