What Is Recission In Telugu: ముంచుకొస్తోంది..ఆర్ధిక మాంద్యం

Recession: What Is It And What Causes It - Sakshi

మాంద్యం... ప్రపంచాన్ని ఇప్పుడు వెంటాడుతున్న పదం ఇది. కరోనా దెబ్బతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి... ఇప్పుడు ధరాభారంతో పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయ్యాక యూరప్, అమెరికా దేశాల్లోనే కాదు ఆసియాలోని చాలా దేశాల్లోనూ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం సెగను తగ్గించేందుకు అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచుతుండటం... చైనాలో మళ్లీ కరోనా భయాలతో అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం.. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు, గ్యాస్‌ రేట్లు భగ్గుమనడం.. ఇలా అనేక పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కోరల్లో చిక్కుకునేలా చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2023లో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనే డేంజర్‌ బెల్స్‌ మోగించింది. యూరప్, అమెరికాలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని కూడా చెబుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, హెచ్‌పీ వంటి అనేక అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు ప్రకటించడం కూడా మాంద్యం ఆందోళనలను మరింత పెంచుతోంది. అసలు ఆర్థిక మాంద్యం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎందుకింత ఘోరంగా తయారైంది? కొలువుల కోతలకు కారణమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి! శివరామకృష్ణ మిర్తిపాటి 

2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్‌ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్‌ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్‌ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం.

గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్‌ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్‌ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్‌ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు.

ప్రపంచ బ్యాంకు తాజా వార్నింగ్‌...
అంచనాలను మించిన ద్రవ్యోల్బణం.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అకస్మాత్తుగా పెరిగిన వడ్డీరేట్లు, మళ్లీ కోవిడ్‌ మహమ్మారి భయాలు, బలహీన డిమాండ్‌ ప్రభావంతో ప్రపంచ ఎకానమీ వృద్ధి రేటు 2023లో 1.7 శాతానికి పడిపోవచ్చని ప్రపంచ బ్యాంకు తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత అంచనా 3 శాతం కాగా, దాదాపు సగానికి కోతపెట్డడం గమనార్హం. ఒకవేళ అమెరికా మాంద్యాన్ని తప్పించుకున్నప్పటికీ, వృద్ధి రేటు మాత్రం 0.5 శాతానికి పడిపోవచ్చని లెక్కగట్టింది. అధిక ధరలు, తీవ్ర వడ్డీరేట్లు, ప్రపంచ ఆర్థిక బలహీనతలు అమెరికా వ్యాపార సంస్థలు, వినియోగదారుల నడ్డివిరుస్తాయని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. కోవిడ్‌ మరింత విస్తరించి, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ముదిరిపోతే... సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతాయని.. అంతిమంగా మాంద్యానికి దారితీయొచ్చని వార్నింగ్‌ ఇచ్చింది. అంతేకాదు... బలహీన చైనా ఎకానమీ కారణంగా, యూరప్‌ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. అమెరికా, యూరప్, చైనా ఏకకాలంలో మందగమనంలో ఉండటం అనేది ప్రపంచ ఎకానమీకి పెను ముప్పుగా మారుతుందని ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టీనా జార్జియేవా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ ఎకానమీ వృద్ధి 0 స్థాయిలో... చైనా వృద్ధి 4.3 శాతానికి, బ్రెజిల్‌ వృద్ధి రేటు 0.8 శాతానికి దిగజారవచ్చనేది ప్రపంచ బ్యాంక్‌ అంచనా.

భారత్‌ బెటర్‌...
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు 2022తో పోలిస్తే ఈ ఏడాది సగానికి పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. మెరుగైన స్థాయిలో 3.4 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ముఖ్యంగా, భారత్‌ జీడీపీ తగ్గినా కూడా మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును నమోదు చేయొచ్చని చెబుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. 2022–23 ఏడాది అంచనా 6.9 శాతంగా ఉంది. దీని ప్రకారం చూస్తే ఏడు అతిపెద్ద వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన దేశంగా ఈ ఏడాది భారత్‌ నిలుస్తుంది. 2020–21లో కోవిడ్‌ కారణంగా భారత్‌ జీడీపీ 7.3 శాతం క్షీణించినా, 2021–22లో తిరిగి కోలుకోవడమే కాకుండా 8.7 శాతం వృద్ధి చెందింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చనేది ప్రభుత్వ అంచనా. మొత్తంమీద చూస్తే ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారినప్పటికీ, భారత్‌ మాత్రం దీన్ని తప్పించుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

అంతా అమెరికానే చేసింది!!
2007–2009 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడంతో పాటు వడ్డీరేట్లను దాదాపు సున్నా స్థాయిలోనే అనేక సంవత్సరాలు కొనసాగించింది అమెరికా. పరిస్థితులు కాస్త సద్దుమణగడం.. అమెరికా స్టాక్‌ మార్కెట్ల జోరు నేపథ్యంలో 2018లో వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచడం మొదలుపెట్టింది ఆ దేశ సెంట్రల్‌  బ్యాంక్‌. అయితే, పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో అన్ని దేశాల ఎకానమీలు ఒక్కసారిగా స్తంభించిపోయి, కుప్పకూలాయి.

దీంతో మళ్లీ అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను అమాంతం సున్నా స్థాయికి తీసుకొచ్చి, లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది. కోవిడ్‌ నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ముంచుకొచ్చింది. అమెరికా, యూరప్‌ ఇతరత్రా వాటి మిత్ర దేశాలు రష్యాపై పరోక్ష యుద్ధానికి కాలుదువ్వడం.. ఆంక్షల కొరడా ఝుళిపించడంతో క్రూడ్, ఆహారోత్పత్తుల ధరల మంట మొదలైంది. ద్రవ్యోల్బణం దూసుకెళ్లడంతో అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీరేట్లను ఎకాయెకిన పెంచేయడం మొదలెట్టాయి. అమెరికా తన ఆర్థిక ప్యాకేజీలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. కాగా, చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించకపోవడంతో ధరాఘాతం మరికొన్నాళ్లు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదీ వడ్డీరేట్లు మరింత పెరిగిపోవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇదే జరిగితే.. ఎకానమీలు మరింత మందగిస్తాయని.. వెరసి ప్రపంచ మాంద్యానికి ఇంకాస్త చేరువకావడం ఖాయమని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ‘ప్రపంచ వృద్ధి తీవ్రంగా మందగిస్తోంది. ఇది మరింత దిగజారితే, చాలా దేశాలు మాంద్యంలోకి జారిపోతాయి. ఈ ధోరణులు చాలాకాలం కొనసాగనుండటం అందోళనకరమైన విషయం. ఇదే జరిగితే వర్థమాన దేశాల ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారు’ అని ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్పాస్‌ అభిప్రాయపడ్డారు.

వణికిస్తున్న వడ్డీరేట్లు...
2007లో దాదాపు 5 శాతం స్థాయిలో ఉన్న అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేటు.. అప్పటి ఆర్థిక సంక్షోభం తర్వాత సున్నా స్థాయికి దిగొచ్చింది. దాదాపు 2016 వరకూ ఇదే స్థాయిలో కొనసాగింది. అయితే, తర్వాత మళ్లీ పెరుగుతూ 2.25 శాతానికి చేరింది. ఆ సమయంలో కోవిడ్‌ దెబ్బకు మళ్లీ 2020లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేటును సున్నాకు తగ్గించేసింది. రెండేళ్లపాటు అక్కడే ఉంచింది. ఎకానమీ కాస్త మెరుగైన సంకేతాలకు తోడు.. ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతానికి చేరి  (40 ఏళ్ల గరిష్ఠం) ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఈ ఏడాది మళ్లీ పెంపు మొదలుపెట్టి డిసెంబర్‌ నాటికి 4.5 శాతానికి చేర్చింది. ఈ ఏడాదిలో ఇది 5.25 శాతానికి చేరే అవకాశం ఉంది. దీంతో డాలరు విలువ ఎగబాకి.. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలను కుదేలు చేసింది. మన రూపాయి కూడా దాదాపు 83 స్థాయికి బక్కచిక్కి ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి పడిపోవడం తెలిసిందే. అయితే, మిగతా కరెన్సీలతో పోలిస్తే మనదే కాస్త తక్కువ క్షీణించడం విశేషం. అమెరికా వడ్డీరేట్ల పెంపు జోరు, ద్రవ్యోల్బణంపై పోరు కారణంగా అటు యూరప్‌తో పాటు ఇతర దేశాల సెంట్రల్‌ బ్యాంకులూ వడ్డీరేట్లను తప్పక పెంచాల్సి వస్తోంది. మన ఆర్‌బీఐ కూడా కీలక రెపో రేటును 4 శాతం నుంచి ఇప్పుడు 6.25 శాతానికి పెంచడంతో కార్పొరేట్లు, ఇటు రిటైల్‌ రుణ గ్రహీతలపై వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. వెరసి ఆర్థిక వ్యవస్థలు మరింత మందగిస్తున్నాయి.

యూరప్‌ సెల్ఫ్‌ గోల్‌...
అసలే అంతంతమాత్రంగా ఉన్న యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో మరింత దిగజారింది. ముఖ్యంగా అమెరికా ప్రోద్బలంతో రష్యాపై విధించిన ఆంక్షలు చివరికి యూరప్‌ దేశాల మెడకే చుట్టుకున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ సరఫరాలను నిలిపివేయడం, ఇతరత్రా కమోడిటీ దిగుమతులపై ఆంక్షలకు తోడు జర్మనీకి గ్యాస్‌ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్‌ను పేల్చివేయడం (అమెరికా ఏజెంట్లే చేశారన్నది రష్యా ఆరోపణ)తో యూరోపియన్‌ దేశాల్లో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని స్థాయికి (చాలా దేశాల్లో ఆల్‌టైమ్‌ గరిష్ఠం) ఎగబాకింది. రష్యా చౌక గ్యాస్, క్రూడ్‌ను కాదని భారీ మొత్తానికి అమెరికా ఇతర దేశాల నుంచి యూరప్‌ దిగుమతి చేసుకుంటోంది. దీంతో అక్కడి పరిశ్రమలు అధిక వ్యయాలతో మూతబడే పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగాల కోతకు దారితీస్తోంది. బ్రిటన్‌ ఎకానమీ ఇప్పటికే క్షీణతలోకి (2022 మూడో త్రైమాసికంలో జీడీపీ మైనస్‌ 0.3% క్షీణించింది) జారుకొని మాంద్యాన్ని చవిచూస్తోంది. మిగతా దేశాలూ అదే బాటలోకి వెళ్లే ప్రమాదం ఉంది. యూరప్‌ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తే అది ప్రపంచ ఎకానమీపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంమీద రష్యా విషయంలో అమెరికా వలలో చిక్కుకుని యూరప్‌ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుందనేది ఆర్థికవేత్తల విశ్లేషణ.

ధరదడ... స్టాగ్‌ఫ్లేషన్‌!
పశ్చిమ దేశాల విచ్చలవిడి కరెన్సీ ప్రింటింగ్‌కు తోడు కరోనా దెబ్బతో సరఫరా వ్యవస్థలు ఛిన్నాభిన్నం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ధరల దెబ్బకు సామాన్యుడే కాదు, ఆర్థిక వ్యవస్థలు సైతం అల్లాడిపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంకలో ద్రవ్యోల్బణం దెబ్బకు ప్రజలు ఎలా రోడ్డెక్కి అధ్యక్షుడిని సైతం పారిపోయేలా చేశారో మనం కళ్లారా చూశాం. అలాగే పాకిస్తాన్‌లో గోధుమ పిండి, ఇతరత్రా నిత్యావసరాల కోసం జరుగుతున్న కొట్లాటలకూ ధరల తీవ్రతే కారణం. మరోపక్క, ఆర్థిక మందగమనం కూడా కొనసాగుతుండటంతో ప్రస్తుతం ప్రపంచం ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ను ఎదుర్కొంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

అధిక ద్రవ్యోల్బణానికి తోడు జీడీపీ వృద్ధి అంతకంతకూ పడిపోతూ ఉండటం, ఫలితంగా నిరుద్యోగం తీవ్రతరం కావడాన్ని స్టాగ్‌ఫ్లేషన్‌గా పేర్కొంటారు. కంపెనీల లాభదాయకత పడిపోవడంతో ఉద్యోగాల కోతకు దారితీస్తుంది. మాంద్యం–ద్రవ్యోల్బణంగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇది పాలసీ నిర్ణయాల విషయంలో డైలమాకు కారణమవుతుంది. ఎందుకంటే, అధిక ధరలకు కళ్లెం వేయాలంటే కొన్ని నెలల పాటు వడ్డీరేట్లను పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్‌ సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోతుంది. ధరలు కట్టడి అయ్యేంతవరకూ సెంట్రల్‌ బ్యాంకులు అదేపనిగా వడ్డీరేట్లను పెంచడం వల్ల నిరుద్యోగం మరింత పెరగడంతో పాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి వెళ్లిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

చైనాలో జీరో కోవిడ్‌ పాలసీ దెబ్బ...
కరోనాతో 2020లో పాతాళానికి పడిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు.. 2021లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. అయితే, చైనా మాత్రం జీరో కోవిడ్‌ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలకు తోడు, 2022లో కొత్త వేరియంట్‌ బీఎఫ్‌7 కారణంగా లాక్‌డౌన్‌లకు తెరతీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రపంచ తయారీ భాండాగారంగా పేరొందిన చైనా నుంచి వాణిజ్యం కుంటుపడటం.. ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసింది. ఈ పరిణామాలతో చైనాలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2022లో 3 శాతానికి పరిమితమైంది.

2020లో కోవిడ్‌ వల్ల 2.2 శాతానికి పడిపోయిన ఉదంతాన్ని మినహాయిస్తే, 1976 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి.  2021లో జీడీపీ వృద్ధి 8.1 శాతం కావడం గమనార్హం. అయితే, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో జీరో కోవిడ్‌ పాలసీకి 2022 డిసెంబర్‌లో చైనా చెల్లు చెప్పినప్పటికీ.. తిరిగి మళ్లీ ఎకానమీ పుంజుకోవడానికి చాలా నెలలు పట్టొచ్చనేది ఆర్థిక వేత్తల మాట. పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ క్షీణత, బలహీన ప్రపంచ డిమాండ్‌ వంటివి 2023లో చైనాకు పెను సవాళ్లుగా నిలుస్తాయని మూడీస్‌ ఎకనమిస్ట్‌ హ్యారీ మర్ఫీ క్రూయిజ్‌ విశ్లేషిస్తున్నారు. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం అంటే ప్రపంచ మాంద్యానికి మరింత దగ్గరైనట్లేనని కూడా పేర్కొంటున్నారు.

ఒకపక్క మాంద్యం భయాలకు తోడు... వ్యయాలు తడిసిమోపెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. అంతేకాదు, చాలా కంపెనీలు కొత్త ఉద్యోగాలను కూడా (హైరింగ్‌) తాత్కాలికంగా ఆపేస్తుండటం ఆర్థిక వ్యవస్థల్లో బలహీనతకు నిదర్శనం. ప్రపంచ టాప్‌ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది.

గూగుల్‌ దాదాపు 12,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుండగా, హెచ్‌పీ దాదాపు 6,000 మందిని సాగనంపింది. ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటా సైతం ఆదాయాలు పడిపోతుండటంతో 11,000 కొలువులకు కోత పెట్టింది. ఇక ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సిబ్బందిని సగానికి సగం తగ్గించి, దాదాపు 3,500 మందిని ఇంటికి పంపారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌ అయితే, ఏకంగా 18,000 మందిపై వేటు వేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద కోత. ఇందులో భారత్‌లోనూ 1,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాప్తంగా 10,000 కొలువులు (మొత్తం ఉద్యోగుల్లో 5%) కట్‌ చేస్తామని ప్రకటించింది. ఇంకా చిన్నాచితకా టెక్‌ కంపెనీలతో పాటు పెప్సికో, ఫోర్డ్‌ వంటి తయారీ రంగ కంపెనీలు సైతం ఇదే బాటలో వెళ్తున్నాయి. ‘లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది టెక్నాలజీ కంపెనీలు దాదాపు 1,50,000 ఉద్యోగులను తొలగించినట్లు అంచనా. ఇక 2023 విషయానికొస్తే, ఇప్పటికే 104 పైగా కంపెనీలు సుమారు 26,000 మందికి పింక్‌ స్లిప్స్‌ ఇచ్చాయి. అంటే రోజుకు 1,600 మంది కొలువులు కోల్పోయారన్నమాట! ఆర్థిక వృద్ధి మరింత పడిపోయి, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే రానున్నకాలంలో ఒక్క టెక్నాలజీ కంపెనీలే కాకుండా అన్ని రంగాల్లోనూ మరిన్ని కోతలు తప్పవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్‌ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్‌ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్‌ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్‌ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్‌ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్‌ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top