Smart Phone Security Tips: మీ ఫోన్‌ హ్యాకింగ్‌ ఇలా కూడా జరుగుతుందని గుర్తించండి

Rebooting Smart Phone In Every Week Prevents Hacking Says Experts - Sakshi

ఈ మధ్య కాలంలో పెగాసస్‌ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్‌ వ్యక్తుల ఫోన్‌ డేటా, కాల్‌ రికార్డింగ్‌లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్‌ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది.  అయితే హ్యాకింగ్‌కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్‌ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ  వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్‌ టిప్‌ చెబుతున్నారు సెన్‌ అంగస్‌ కింగ్‌.

సెన్‌ అంగస్‌ కింగ్‌(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్‌ను రీబూట్‌ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్‌ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్‌.. కేవలం ఫోన్‌ను ఆఫ్‌ చేసి ఆన్‌ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్‌ ఇన్‌సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు.  అయితే..

పూర్తిగా కాకున్నా.. బోల్తా
స్మార్ట్‌ ఫోన్‌ రీబూట్‌ అనేది సైబర్‌ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్‌ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తు‍న్న ఈ టెక్నిక్‌పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్‌ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్‌ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్‌’ పంపిస్తారు. అయితే ఫోన్‌ రీస్టార్ట్‌ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్‌ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్‌’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్‌ను తమ టార్గెట్‌ లిస్ట్‌ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. 

జీరో క్లిక్‌ అంటే.. 
జీరో క్లిక్‌ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్‌ చేస్తే ఫోన్‌ హ్యాక్‌ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్‌లోకి చొరబడే లింక్స్‌. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్‌ను ఫోన్‌లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్‌ ఫోన్‌లోకి ఎంటర్‌ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్‌ రీబూట్‌ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్‌ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ,  ఫోన్‌ను రీస్టార్ట్‌ చేయడమనే సింపుల్‌ ట్రిక్‌తో హ్యాకింగ్‌ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top