వడ్డింపే తరువాయి! | RBI to take action soon to control prices | Sakshi
Sakshi News home page

వడ్డింపే తరువాయి!

May 20 2026 2:15 AM | Updated on May 20 2026 7:47 AM

RBI to take action soon to control prices

ధరల కట్టడికి త్వరలో ఆర్‌బీఐ చర్యలు

క్రూడ్‌ మంట.. రూపాయి భారీ పతనం ఎఫెక్ట్‌

ఇప్పటికే నిత్యావసరాలు,పెట్రో ధరలు పైపైకి

సుంకాల పెంపుతో ఎగబాకిన బంగారం, వెండి రేట్లు

దూసుకెళుతున్న ద్రవ్యోల్బణం..

వడ్డీ రేట్ల పెంపు తప్పదంటున్న విశ్లేషకులు

దీంతో ఈఎంఐలకు రెక్కలు...

ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్‌ తర్వాత ప్రజలకు వరస షాక్‌లు  

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: అసలే నిత్యావసరాల ధరల మంట.. ఆపై పెట్రో పోటుతో అల్లాడుతున్న ప్రజలకు మరో గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం... ఆఖరికి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారినీ వదిలేట్లు లేదు. కొండెక్కిన క్రూడాయిల్‌ సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటం... రూపాయి అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో త్వరలోనే రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లు పెంచొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. 

ఇదే జరిగితే గృహ, వాహన, పర్సనల్, కార్పొరేట్‌ లోన్లు భారమవుతాయి. దీంతో నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకుతాయి. మరోపక్క, వడ్డీ రేట్ల పెంపుతో వినియోగం తగ్గి.. ఎకానమీ వృద్ధి మరింత మందగించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నారు! మోదీ పొదుపు వార్నింగ్‌ తర్వాత అటు బంగారం, వెండిపై సుంకాల మోత, దిగుమతి ఆంక్షలు... పెట్రో వాతతో షాకిచ్చిన సర్కారుకు ఇక ఆర్‌బీఐ కూడా జతయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 5న తీసుకోబోయే సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ముడిచమురు బ్యారెల్‌ 100 డాలర్ల పైకి దూసుకెళ్లి, గత రెండున్నర నెలలుగా దాదాపు అదే స్థాయిలో కదలాడుతోంది. 

మన బంగారం, క్రూడ్‌ అవసరాల్లో 85 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో దిగుమతుల బిల్లు భారమై రూపాయి మరింత బక్కచిక్కింది. ప్రస్తుతం సరికొత్త ఆల్‌టైమ్‌ కనిష్టం 96.60కి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనంతో డాలర్లు ఎగిరిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలతో మన ఫారెక్స్‌ నిల్వలు కరిగిపోతున్నాయి. మరోపక్క, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో (వారంలోపే దాదాపు రూ.4 చొప్పున రెండు సార్లు) ద్రవ్యోల్బణం ఎగబాకుతోంది. దీంతో ఆర్‌బీఐ మళ్లీ వడ్డీరేట్లు పెంచవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత బాండ్‌ మార్కెట్‌ ట్రెండ్‌.. రేట్ల పెంపు సిగ్నల్‌ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బాండ్‌ రాబడులు (ఈల్డ్స్‌) గత రెండు నెలల్లో ఎగబాకడం (10 ఏళ్ల ప్రామాణిక ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌ 6.25 శాతం నుంచి 7.06 శాతానికి జంప్‌ చేసింది) చూస్తుంటే.. చమురు ధరల సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకి, రూపాయి మరింత బలహీన పడుతుందన్న ఆందోళనలకు అద్దంపడుతోందని విశ్లేషిస్తున్నారు. 

గతేడాది 1.25 శాతం తగ్గింపు... 
ధరలు అదుపులో ఉండటంతో... జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబర్‌ వరకు ఆర్‌బీఐ నాలుగు విడతల్లో రెపో రేటును 1.25 శాతం తగ్గించింది. దీంతో ఈ కీలక పాలసీ రేటు 6.5 శాతం గరిష్ట స్థాయి నుంచి 5.25 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా దీన్ని రుణగ్రహీతలకు బదలాయించడంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు దిగొచ్చాయి. కానీ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్‌ రేట్లు భగ్గుమనడం, రూపాయి భారీ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలతో ఆర్‌బీఐ అప్పటి నుంచీ పాలసీ రేట్లను యథాథంగానే కొనసాగిస్తోంది. అవసరమైతే రేట్లను తగ్గించేలా తటస్థ (న్యూట్రల్‌) విధానాన్ని కూడా మార్చలేదు. తీరా చూస్తే, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కాగా, చివరిసారిగా ఆర్‌బీఐ రెపో రేటును 2023 ఫిబ్రవరిలో పావు శాతం పెంచింది. 

ఈ ఏడాది పెంపు.. రెండు విడతలు 
రూపాయి పతనం, ధరల పెరుగుదలకు అడ్డకట్ట పడాలంటే తదుపరి పాలసీ భేటీలో వడ్డీ రేట్ల పెంపు ‘దాదాపు అనివార్యం’గా కనిపిస్తోందని బ్రోకరేజి దిగ్గజం ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఒకవేళ క్రూడ్‌ రేటు 100 డాలర్ల పైనే కొనసాగితే (ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది) పాలసీ భేటీతో సంబంధం లేకుండా సడన్‌గా వడ్డీ రేట్ల షాక్‌కు కూడా అవకాశం ఉందంటోంది. అయితే, ప్రస్తుతానికి ఆర్‌బీఐ అప్రమత్త ధోరణితోనే వ్యవహరించవచ్చని, రానున్న పాలసీలో సమీక్షలో తక్షణం వడ్డీ రేట్ల పెంపు వంటి కఠిన చర్యలకు దిగే అవకాశం లేదని చాయిస్‌ వెల్త్‌ సీఈవో నికుంజ్‌ సరాఫ్‌ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు మూడు నెలల్లో ద్రవ్యోల్బణం గణాంకాలు, స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. ఇందన సెగకు తోడు ఎల్‌నినో (వర్షాభావం) రిసు్కల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకడంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని హెచ్‌ఎస్‌బీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరీ తీవ్రంగా పెంచకపోవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్ధంలో రెండు విడతల్లో అర శాతం రెపో రేటు పెంపునకు ఆస్కారం ఉందని పేర్కొంది. 

ధరాఘాతం.. ఎల్‌నినో ఆజ్యం! 
వాణిజ్య గ్యాస్‌ రేట్ల భారీ పెరుగుదలతో ఇప్పటికే ఆహార ధరలకు రెక్కలొచ్చాయి. మరోపక్క, అధిక క్రూడ్‌ ధరల కారణంగా ముడి వస్తువులు భారంగా మారడంతో ఎఫ్‌ఎంసీజీ, వాహన, వినియోగ వస్తువులు, ఎల్రక్టానిక్స్‌ సహా పలు కంపెనీలు రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇక తాజాగా పెట్రో పోటు.. ఇంధన ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోస్తోంది. అన్ని రంగాల్లో రవాణా, ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగడంతో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, టోకు ధరల ద్రవ్యోల్బణం భగ్గుమంది. మార్చిలో 3.88 శాతం నుంచి ఏప్రిల్‌లో ఏకంగా 48 నెలల గరిష్ట స్థాయికి (8.3 శాతం) దూసుకెళ్లింది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే, రాబోయే వారాల్లో విడతల వారీగా మరో రూ.10 పెంపు తప్పకపోవచ్చని అంచనా వేసింది. దీనివల్ల జూన్‌ నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి ఎగబాకే రిస్కు ఉందని తెలిపింది. ఇదే జరిగితే ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతం (2% అటుఇటుగా) పరిమితిని దాటేసే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే, పులిమీద పుట్రలా ఈ ఏడాది సూపర్‌ ఎల్‌నినో ఆందోళనలు వణికిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వర్షాలు గనుక సరిగ్గా కురవకపోతే ఆహార ధరలు మరింత భగ్గుమంటాయని హెచ్‌ఎస్‌బీసీ హెచ్చరించింది. 

గృహ రుణంపై ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే... 
గడిచిన ఏడాది కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేటు 9.5% గరిష్ట స్థాయి నుంచి 7.5% వరకు దిగొచ్చింది. ఆర్‌బీఐ గనుక త్వరలో పావు శాతం రెపో రేటును పెంచి, దీన్ని బ్యాంకులు నేరుగా కస్టమర్లకు వర్తింపజేస్తే... హోమ్‌లోన్‌ వడ్డీ రేటు కూడా ఎగబాకుతుంది. వడ్డీ రేట్ల పెంపునకు ముందు ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి 7.75% వడ్డీ రేటుతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే, ఈఎంఐ రూ. 41,047 పడుతుంది. పావు శాతం వడ్డీ రేట్ల పెంపు తర్వాత ఇది రూ.41,822కు పెరుగుతుంది. అంటే, ఒక్కో ఈఎంఐపై రూ.775 అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట! ఒకవేళ ఈఎంఐ పెరగకుండా అలాగే కొనసాగిస్తే, రుణ వ్యవధి మరో 8–10 నెలలు పెరుగుతుంది. ఆమేరకు అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement