ఆపరేటర్లే స్వీయ నియంత్రణ పాటించాలి

Rbi Says No Particular Rule Regulations To Control Fintech Companies - Sakshi

ముంబై: ఫిన్‌టెక్‌ సంస్థలను నియంత్రించేందుకు ‘కచ్చితమైన విధానం‘ అంటూ లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ చౌదరి చెప్పారు. సమతూకం, స్వీయ నియంత్రణ పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్లపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి ఈ విషయాలు చెప్పారు. ‘ఓవైపు ఆర్థిక వ్యవస్థ, కస్టమర్లను రిస్కుల నుంచి కాపాడుతూ మరోవైపు ఫిన్‌టెక్‌ల సానుకూల ప్రభావాలను గరిష్ట స్థాయిలో పెంచే విధంగా వాటిని కచ్చితంగా ఇలాగే నియంత్రించాలన్న విధానమంటూ ఏమీ లేదు.

కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటం, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యాలైతే.. ఫిన్‌టెక్‌ పరిశ్రమ తనకు తానే సమతూకం పాటించాల్సి ఉంటుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా సరైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా సమతూకం వస్తుందని నేను విశ్వసిస్తాను. కేవలం నియంత్రణ ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదని నా అభిప్రాయం. నియంత్రణ అనేది సహాయక పాత్ర పోషిస్తుంది. అత్యుత్తమంగా సమతూకం పాటించే బాధ్యత ఫిన్‌టెక్‌ సంస్థలపైనే ఉంటుంది‘ అని చౌదరి చెప్పారు. ఫిన్‌టెక్‌ రంగంపై ఆర్‌బీఐ మరింతగా దృష్టి పెడుతుండటం, డిజిటల్‌ రుణాల యాప్‌లపై ఇటీవల మార్గదర్శకాలు ప్రకటించడం తదితర అంశాలతో పరిశ్రమలో కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చదవండి: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top