
లెక్కలు, స్టేట్‌మెంట్లు రాయకుండా, వోచర్లు లేకుండా, పుస్తకాలు నిర్వహించకుండా కేవలం టర్నోవర్, వసూళ్ల మీద కొంత శాతం అంటే నిర్దేశిత శాతం లేదా అంత కన్నా ఎక్కువ శాతాన్ని నికర లాభంగా డిక్లేర్ చేసే వెసులుబాటు/విధానాన్ని ‘ఊహాజనిత పన్ను విధానం’ అని అంటారు. ఆంగ్లంలో Presumptive Taxationగా పిలుస్తారు.
ఒక సంవత్సర టర్నోవర్ మీద 8% అనుకొండి. కేవలం 8% మొత్తాన్ని నికర ఆదాయంగా పరిగణిస్తారు. మీరు లెక్కలు నిర్వహించి, శ్రమపడి, ఏ లెక్కలూ తేల్చాల్సిన అవసరం లేదు. టర్నోవర్ మీద 8% లేదా అంతకంటే ఎక్కువగా.. 9 శాతం, 10 శాతం, 11 శాతం ఇలా ఎంతైనా స్వచ్ఛందంగా మీకు నచ్చిన రేటు ప్రకారం నికర ఆదాయం లెక్కించుకోవచ్చు.
ఇది ఎవరికి వర్తిస్తుంది.
➤రెసిడెంట్ వ్యక్తికి
➤రెసిడెంట్ హిందూ ఉమ్మడి కుటుంబానికి
➤రెసిడెంట్ భాగస్వామ్య సంస్థలకి
క్లుప్తంగా చెప్పాలంటే ఈ పద్దతి నాన్ రెసిడెంట్లకు వర్తించదు. నిర్దేశిత ఇండ్రస్టియల్ జోన్లు, ప్రాంతాల్లోని వ్యాపారానికి వర్తించదు. ఇది కాకుండా వాహనాలు అద్దెకు నడిపేవారు, ఏజెన్సీ వ్యాపారం చేసేవారు, కమీషన్, బ్రోకరేజ్‌లకు ఇది వర్తించదు. అంతేకాకుండా సంవత్సరపు టర్నోవర్/వసూళ్లు రూ.2 కోట్లు దాటిన వాటికి వర్తించదు. చిరు వ్యాపారస్తులకు ఊరటగా ఈ వెసులుబాటు కల్పించారు. జీఎస్‌టీ చట్టంలో చిన్న చిన్న వ్యాపారస్తులకు రికార్డుల నిర్వహణలోగానీ, రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియకి గానీ, వర్తించే రేటు విషయంలో ఎటువంటి వెసులుబాటు లేదు. ఆదాయపు పన్ను శాఖ వారిని అభినందించాలి. ఇది నిజంగా చాలా పెద్ద ఉపశమనం అని చెప్పాలి.
నగదు వ్యవహారాలు చేయకపోతే మంచిది
నగదు రహిత వ్యవహారాల విషయంలో మరింత రిలీఫ్ కల్పించారు. మొత్తం టర్నోవర్‌లో వ్యవహారాలు బ్యాంకు ద్వారా జరిగి, కేవలం 5% నగదు వస్తే పైన చెప్పిన పరిమితిని రూ.2 కోట్లుగా గాకుండా రూ.3 కోట్లుగా తీసుకుంటారు. నగదులో వసూళ్ళు లేదా రావడం అంటే ... నగదు, అకౌంటు పే కాని చెక్కు, అకౌంటు పే కాని బ్యాంకు డీ.డీ. దీనర్థం ఏమిటంటే బ్యాంకు అకౌంటు ద్వారా వ్యవహారాలు జరగాలి.
ఊహాజనిత పన్ను రేటు 8%, 6 శాతం
మొత్తం అన్ని అమ్మకాలు/వసూళ్లు బ్యాంకు ద్వారా జరిగితే/జరిపితే.. ఆరుశాతం చొప్పున లెక్కిస్తారు. అలా కాకపోతే.. అంటే నగదు/బ్యాంకుల ద్వారా వసూళ్లు/అమ్మకాలు ఉంటే 8% చొప్పున లెక్కించాలి.
ఊదాహరణగా మీ టర్నోవర్ రూ.2 కోట్లు అనుకొండి. ఈ మొత్తం అంతా బ్యాంకు ద్వారా వచ్చినట్లయితే రూ.2 కోట్ల మీద 6% అంటే రూ.12 లక్షలు. వసూళ్లు మిశ్రమం అయితే, 8% చొప్పున.. అంటే రూ.16 లక్షలు లేదా అంత కన్నా ఎక్కువ చూపించవచ్చు. 9%, 10%, 11 శాతం ఇలా మీ ఇష్టం. ఇలా లెక్కించిన మొత్తాన్ని ఆదాయం అని అంటారు. ఈ ఆదాయంలోంచి ఎటువంటి వ్యాపార ఖర్చులు, వ్యాపార సంబంధమైన, తరుగుదల మొదలైనవి తగ్గించరు. జీతాలు, భత్యాలు , కొనుగోళ్లు ఏ ఖర్చులు మినహాయించరు. కానీ ఈ ఆదాయంలోంచి మీరు పాత పద్దతిని ఎంచుకున్నట్లు అయితే సెక్షన్ 80 కేటగిరిలో తగ్గిస్తారు. మీరు 8% కన్నా ఎక్కువ శాతం కూడా డిక్లేర్ చేయొచ్చు.
8% చొప్పున తీసుకుంటే.. 92% మీరు ఖర్చు చేసినట్లు పరిగణిస్తారు. ఓ వోచర్ చూపించక్కర్లేదు. ఓ బుక్ రాయాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారం 8% లో (కొన్ని సందర్భాల్లో 6 శాతం) కూడా లాభం ఉండదనుకుంటే...మీరు కచ్చితంగా బుక్స్ నిర్వహించాలి. ఆ బుక్స్‌ను అడిట్ చేయించాలి. ఇలాంటి ఆడిట్‌ను, టాక్స్ ఆడిట్ అని అంటారు. ఒక్కసారి టాక్స్ ఆడిట్‌కి గురి అయితే అలా ఐదేళ్ల పాటు కొనసాగించాలి. ఒక సంవత్సరం 8% చొప్పున మరొక సంవత్సరం టాక్స్ ఆడిట్ కొనసాగించకూడదు. భాగస్వామ్య సంస్థలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. టాక్స్ ప్లానింగ్ విషయానికొస్తే.. 8% కన్నా ఎక్కువ వచ్చే సందర్భంలో ఈ సెక్షన్ ప్రకారం 8 శాతానికి ఎంచుకోవడం ఉత్తమం.