నిమిషాల్లోనే ఐస్‌క్యూబ్స్‌.. అంతేనా మరెన్నో ప్రత్యేకతలు ఈ ఫ్రిజ్‌ సొంతం!

Portable Fridge: Water Get Ice Cubes In Minutes - Sakshi

ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకోవాలంటే, కొన్ని గంటల ముందుగానే ట్రేలో నీరు నింపి, డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు రిఫ్రిజిరేటర్లలో ఐస్‌ తయారవడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్‌ నిమిషాల్లోనే తయారవుతాయి. ఇళ్లల్లో వాడుకునే ఫ్రిజ్‌లను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోలేం. ఈ ఫ్రిజ్‌నైతే ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. ఇది పోర్టబుల్‌ ఫ్రిజ్‌.

సాధారణ ఫ్రిజ్‌ల కంటే చాలా తేలిక కూడా. కాస్త పెద్ద సూట్‌కేసు సైజులో ఉండే ఈ ఫ్రిజ్‌కు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మోత బరువు లేకుండానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తరలించవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే పద్దెనిమిది ఐస్‌క్యూబ్స్‌ తయారవుతాయి. ఇందులో నీళ్లు, పాలు, కూల్‌డ్రింక్స్, కూరగాయలు, పండ్లు వంటివి భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది.

ఇది పూర్తిగా సోలార్‌ చార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా దీనిలోని అడ్జస్ట్‌మెంట్స్‌ను ఎక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘ఎకో ఫ్లో’ కంపెనీ ఈ అత్యాధునిక పోర్టబుల్‌ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించింది. దీని ధర 899 డాలర్లు (రూ.73,402) మాత్రమే!

చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మార్పులు రానున్నాయ్‌, నిమిషానికి 2 లక్షల టికెట్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top