ఫార్మాకు కలిసొచ్చిన ఉత్తర అమెరికా

Pharma exports from india 2020 in 7percent growth - Sakshi

ఏప్రిల్‌–జూన్‌లో 38 శాతం వాటా

తోడైన మిడిల్‌ ఈస్ట్, ఆసియాన్‌

ఎగుమతుల్లో 7.16 శాతం వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) గణాంకాల ప్రకారం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఎగుమతులు 7.16 శాతం అధికమై రూ.37,875 కోట్ల నుంచి రూ.40,590 కోట్లకు చేరాయి. డ్రగ్‌ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్‌ ఒక్కటే వృద్ధికి తోడైంది. ఇతర విభాగాలన్నీ నిరాశపరిచాయి. డ్రగ్‌ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్‌ విభాగం 15.14 శాతం వృద్ధితో రూ.31,042 కోట్లు నమోదైంది.

మొత్తం ఎగుమతుల విలువలో ఈ విభాగం వాటా ఏకంగా 76.48 శాతం ఉండడం గమనార్హం. వ్యాక్సిన్స్‌ 30 శాతం, ఆయుష్‌ 25, సర్జికల్స్‌ 15.8, బల్క్‌ డ్రగ్స్, డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌ 8 శాతం, హెర్బల్‌ ప్రొడక్ట్స్‌ 2.5 శాతం తిరోగమన వృద్ధి సాధించాయి. ఎగుమతులకు ఊతమిచ్చే బల్క్‌ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్‌ ఈ త్రైమాసికంలో మాత్రం 8.38 శాతం మైనస్‌లోకి వెళ్లాయని ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా ఫార్మా రంగం తిరోగమనంలో ఉన్నప్పటికీ ఏప్రిల్‌–జూన్‌లో ఎగుమతుల వృద్ధి సాధించడం విశేషమన్నారు.  

కొన్ని ప్రాంతాలు మినహా..: ఎగుమతుల్లో కొన్ని ప్రాంతాలు (రీజియన్లు) మినహా మిగిలినవన్నీ వృద్ధిని నమోదు చేశాయి. మధ్యప్రాచ్య మినహా ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలు, దక్షిణాసియా, కొన్ని యూరప్‌ దేశాలు నిరాశపరిచాయి. అయితే 2020 ఏప్రిల్‌–జూన్‌లో ఉత్తర అమెరికా మార్కెట్‌ ఎగుమతులకు ఊతమిచ్చింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ రీజియన్‌ 15.67 శాతం వృద్ధితో రూ.15,450 కోట్ల ఎగుమతులను నమోదు చేసింది. మొత్తం ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్తర అమెరికా వాటా అత్యధికంగా 38 శాతం ఉంది. వృద్ధి పరంగా మధ్య ప్రాచ్య దేశాలు 14 శాతం అధికమై రూ.2,220 కోట్లు, ఆసియాన్‌ ప్రాంతం 10.5 శాతం హెచ్చి రూ.2,580 కోట్లు సాధించాయి. పరిమాణంలో రెండో స్థానంలో ఉన్న ఆఫ్రికా మార్కెట్లు 0.4 శాతం పెరిగి రూ.6,510 కోట్లు, మూడో స్థానంలో ఉన్న యురోపియన్‌ యూనియన్‌ 6.9 శాతం అధికమై రూ.6,000 కోట్ల ఎగుమతులను నమోదు చేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top