Paytm : భారీగా రుణ సమీకరణ

Paytm Planning To Huge Fundraising By IPO - Sakshi

రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యం!

రూ. 1.78 లక్షల కోట్లకు కంపెనీ విలువ

జులై 12న వెలువడనున్న కీలక నిర్ణయాలు  

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్‌ భారీ ఐపీవోకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 16,600 కోట్లు సమకూర్చుకునేందుకు వీలుగా వాటాదారుల అనుమతి కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా కంపెనీ విలువ రూ. 1.78 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. పేటీఎమ్‌ ఈ నెల 12న అసాధారణ వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తోంది. దీనికి అదనంగా కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు వాటాలు విక్రయించడం ద్వారా రూ. 4,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి రూ. 16,600 కోట్ల ఐపీవోకు వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా కంపెనీ విలువ రూ. 1.78–2.2 లక్షల కోట్లస్థాయికి చేరవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. తద్వారా దేశీయంగా లిస్టయిన ఫైనాన్షియల్‌ సర్వీసుల కంపెనీలలో మార్కెట్‌ విలువరీత్యా టాప్‌–10లో ఒకటిగా నిలవనుంది. 

పేటీఎమ్‌ ప్రధాన వాటాదారుల్లో  చైనీస్‌ దిగ్గజం యాంట్‌ గ్రూప్‌(29.71% వాటా), సైఫ్‌ పార్టనర్స్‌(18.56 శాతం), విజయ్‌ శేఖర్‌ శర్మ(14.67 శాతం)తోపాటు.. ఏజీహెచ్‌ హోల్డింగ్, టీ రోవే ప్రైస్, డిస్కవరీ క్యాపిటల్‌ బెర్కషైర్‌ హాథవే ఉన్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top