గ్రహశకలం నుంచి భూమి వైపుగా వస్తోన్న ఒసిరిస్‌ రెక్స్‌ 

OSIRIS REx Space Probe Heads Home With Asteroid Dust From Bennu - Sakshi

వాషింగ్టన్‌: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక ఒసిరిస్‌ రెక్స్‌ 2020లో అక్టోబరు 21న విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై తాకిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గ్రహశకలంపై కంప్రెస్డ్‌ నైట్రోజన్‌ వాయువుతో పేలుడును సృష్టించి గ్రహశకలంపై ఉన్న దూళి కణాలను సేకరించింది. దాంతోపాటుగా ఒసిరిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌకలో అమర్చిన రోబోటిక్‌ ఆర్మ్‌ సహాయంతో గ్రహశకలంపై ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి, తిరిగి బెన్నూ గ్రహశకలం నిర్ణీత కక్ష్యలోకి చేరింది.

తాజాగా ఒసిరిస్‌ రెక్స్‌ నౌక బెన్నూ గ్రహశకలం ఆర్బిట్‌ను వీడి భూమి వైపుకు అడుగులు వేస్తోన్నట్లు నాసా తెలిపింది. ఈ నౌక 33.4 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమిని చేరనుంది. ఒసిరిస్‌ రెక్స్‌ నౌక 2023 సెప్టెంబర్‌ 24 న ఉటా ఎడారిలో ల్యాండ్‌ అవుతుందనీ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఒసిరిస్‌ రెక్స్‌ నౌక గంటకు 600 మైళ్ల వేగంతో భూమి వైపుగా కదులుతోంది. నౌకతో పాటుగా బెన్నూ గ్రహశకలంపై సేకరించిన 60 గ్రాముల ధూళి, రాళ్లు, మట్టి కణాలను తీసుకొనివస్తోంది. 

గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాలతో సౌరకుటుంబం పుట్టుకకుసంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. అపోలో సమూహంలోని బెన్నూ ఒక కార్బోనేషియస్ గ్రహశకలం.దీనిని లీనియర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 1999 సెప్టెంబర్‌ 11 కనుగొన్నారు.ఈ గ్రహశకలం 2175-2199 మధ్య సంవత్సరాలలో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. బెన్నూ సగటు వ్యాసం 490 మీటర్లు. ఒసిరిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌక బరువు సుమారు 880 కిలోగ్రాములు

చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్‌...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top