శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం

OneWeb Partners With ISRO To Launch Satellites From 2022 - Sakshi

ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్‌టెల్‌ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్‌ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్‌లైన్‌ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్‌ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు.

అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు.

అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు
ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్‌ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్‌ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్‌ కేంద్రంగా 2012లో జార్జివేలర్‌ అనే వ్యక్తి  స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్‌ వచ్చేసింది. ధర ఎంతంటే?)

ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌ స్పేస్‌ కంపెనీ రష్యా సోయజ్‌ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top