ఆ రూ. 200 కోట్లు... 45 రోజుల్లో కట్టేయండి

NCLAT upholds Rs 200 Cr CCI fine on Amazon for Future Coupons deal - Sakshi

అమెజాన్‌కు ఎన్‌సీఎల్‌ఏటీలోనూ చుక్కెదురు

ఫ్యూచర్‌తో డీల్‌ను సస్పెండ్‌ చేస్తూ సీసీఐ ఆర్డర్‌కు సమర్థింపు  

Amazon Future Coupons Case, న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌ సబ్సిడీ– ఫ్యూచర్‌ కూపన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో (ఎఫ్‌సీఎల్‌సీ) ఒప్పందం విషయంలో అమెజాన్‌కు నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లోనూ చుక్కెదురైంది. ఒప్పందాన్ని  సస్పెండ్‌ చేస్తూ కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వును అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ కూడా సమర్థించింది. ఒప్పందంపై కొన్ని అంశాలను దాచిపెట్టినందుకు దీనిని సస్పెండ్‌ చేస్తున్నట్లు 2021 డిసెంబర్‌ 17వ తేదీన అమెజాన్‌కు కాంపిటేషన్‌ వాచ్‌డాగ్‌ రూ.200 కోట్ల జరిమానా విధించింది. దీనిని అమెజాన్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. అయితే ఇక్కడ ఈ–కామర్స్‌ దిగ్గజానికి చుక్కెదురైంది. ఈ వివాదంలో సీసీఐ విధించి రూ.200 కోట్ల డిపాజిట్‌కు అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ అమెజాన్‌కు 45 రోజుల సమయం మంజూరు చేసింది. అయితే సెక్షన్‌ 44, 45 సెక్షన్ల క్రింద విధించిన రూ.కోటి చొప్పన ప్రత్యేక జరిమానాలను రూ.50 లక్షల చొప్పున తగ్గించింది.  

మరిన్ని వివరాలు...
అమెజాన్‌.కామ్‌ అనుబంధ సంస్థ అమెజాన్‌.కామ్‌ ఎన్‌వీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ఎఎసీ( అమెజాన్‌) 2019 ఆగస్టులో అన్‌లిస్టెడ్‌  ఫ్యూచర్‌ కూపన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌సీపీఎల్‌)లో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. డీల్‌ విలువ రూ.1,400 కోట్లు. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 9.82 శాతం వాటా (కన్వర్టబుల్‌బాండ్స్‌ ద్వారా) ఉంది. ఈ ఒప్పందాన్నే కారణంగా  చూపిస్తూ, ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలుకు సంబంధించి మొదటి హక్కు తమకే ఉంటుందని, 3 నుంచి 10 సంవత్సరాల్లో తాను ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే వెసులుబాటు ఒప్పందం ప్రకారం ఉందని  అమెజాన్‌ వాదిస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో ఎఫ్‌ఆర్‌ఎల్‌ (దీనితో సహా మరో 19 కంపెనీలు) రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని  వ్యతిరేకిస్తూ  తీవ్ర న్యాయపోరాటం చేసింది. అయితే అసలు ఫ్యూచర్స్‌తో ఒప్పంద ప్రతిపాదనను పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు రిలయన్స్‌ ఏప్రిల్‌లో ప్రకటించింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌లో దివాలా చర్యలను ఎదుర్కొంటోంది.  

సీఏఐటీ హర్షం
కాగా, అమెజాన్‌ వాదనలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ వివాద విచారణలో భాగంగా ఉన్న కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) తాజా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ రూలింగ్‌పై వ్యాఖ్యానిస్తూ, ‘‘భారత్‌ ఈ–కామర్స్‌ అలాగే రిటైల్‌ వాణిజ్యాన్ని ఎవరైనా గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటే, ఈ చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కాబోవు’’ అని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top