భారత్‌ వృద్ధి రేటు అంచనాకు మూడీస్‌ రెండవ కోత

Moody cuts India GDP growth projection for 2022 from 7. 7  - Sakshi

7.7 శాతం నుంచి 7 శాతానికి డౌన్‌

ప్రపంచ మందగమనం, అధిక వడ్డీరేట్లు కారణమని విశ్లేషణ  

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ తగ్గించింది. 2022 భారత్‌ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్‌ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్‌ 2023–24 నివేదికలో మూడీస్‌ పేర్కొంది.

2024లోనే వెలుగు రేఖలు...
 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్‌లుక్‌ పేర్కొంది. 2021 క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ వృద్ధి 8.5 శాతమని మూడీస్‌ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని  మూడీస్‌ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్‌ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్‌ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top