బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకు 50 శాతం రీయంబర్స్‌మెంట్‌.. వాళ్లకు మాత్రమే!

Minimum 2 Mbps Speed For BroadBand Connection Suggest TRAI - Sakshi

TRAI Recommandations On Internet Speed: ఇంటర్నెట్‌ మినిమమ్‌ స్పీడ్‌ విషయంలో​ సర్వీస్‌ ప్రొవైడర్లకు, కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది టెల్‌కామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌). ప్రస్తుతం ఉన్న మినిమ్‌ ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను 2 ఎంబీపీఎస్‌కు పెంచాలని తెలిపింది. 

బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ విషయంలో ట్రాయ్‌ కొన్ని కీలక సూచనలు చేసింది.  ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్‌ స్పీడ్‌ బేసిక్‌ అప్లికేషన్స్‌ కూడా తెరవడానికి సరిపోవని అభిప్రాయపడింది.  మినిమమ్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌(megabits per second) ఉండేటా చేసుకోవాలని సూచించింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల వేగాన్ని పెంచాలని, అందుకోసం మంత్లీ సబ్ సబ్ స్క్రిప్ట్షన్ ఫీజులో 50 శాతం రీయంబర్స్‌మెంట్‌ రూరల్‌ కనెక్షన్‌దారులకు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది ట్రాయ్‌.

 

గతంలో 256 కేబీపీఎస్‌ స్పీడ్‌ను 2014లో 512 కేబీపీఎస్‌కు అప్‌గ్రేడ్‌ చేయించింది ట్రాయ్‌. ఇప్పుడు ఆ స్పీడ్‌ను నాలుగు రెట్లు పెంచాలని చెబుతోంది. అంతేకాదు ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఆధారంగా బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను యూకే, యూరప్‌ తరహాలో  కేటగిరీలుగా విభజించాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి దేశాల్లో బేసిక్‌ బ్రాడ్‌బ్యాండ్‌.. 2-50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, ఫాస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్‌.. 50-300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌, సూపర్‌-ఫాస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్‌.. 300 ఎంబీపీఎస్‌ కంటే ఎక్కువ స్పీడ్‌తో కేటగిరీలుగా విభజించారు.

 

ఈ సూచనలతో పాటు దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌లను పెంచేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేంద్రానికి తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 9.1 శాతం ఇళ్లకు మాత్రమే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. చాలా మంది మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.  కేబులింగ్‌ వ్యవస్థ ద్వారా లైన్‌​ సర్వీసులను పొడిగించే ప్రయత్నం చేయాలని తెలిపింది.  అలాగే రూ. 200 కంటే తక్కువ ఛార్జీల నెలవారీ ప్యాక్‌.. సగం రీయంబర్స్‌మెంట్‌ దిశగా ప్రణాళిక అమలు చేయాలని కేంద్రానికి తెలిపింది.  ఈ-రూపీ ద్వారా ఆ డబ్బును కనెక్షన్‌దారుడికి జమ చేయాలని సూచించింది. అయితే ట్రాయ్‌ చేసిన ఈ సూచనల్ని సర్వీస్‌ ప్రొవైడర్లు కచ్చితంగా పాటించాలన్న రూల్‌ లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం పరిగణనలోకి తీసుకుని చట్టం చేయొచ్చు.

చదవండి: 2022కల్లా ఏపీలో ప్రతి పల్లెకు బ్రాడ్‌బ్యాండ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top