మారుతీ లాభం స్కిడ్‌! | Sakshi
Sakshi News home page

మారుతీ లాభం స్కిడ్‌!

Published Thu, Oct 28 2021 4:00 AM

Maruti Q2 net dips 66 percent as chip shortage, rising commodity prices - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం ఏకంగా 66 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 487 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 1,420 కోట్లు.  సెమీకండక్టర్ల కొరత, కమోడిటీ ధరల పెరుగుదల తదితర అంశాలు రెండో త్రైమాసికంలో కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపాయి.

తాజా క్యూ2లో ఆదాయం రూ. 18,756 కోట్ల నుంచి రూ. 20,551 కోట్లకు చేరింది. మొత్తం వాహన విక్రయాలు 3 శాతం క్షీణించి 3,93,130 యూనిట్ల నుంచి 3,79,541 యూనిట్లకు తగ్గాయి. దేశీ విక్రయాలు 3,70,619 యూనిట్ల నుంచి 3,20,133 యూనిట్లకు క్షీణించాయి. అయితే, ఎగుమతులు 22,511 వాహనాల నుంచి ఏకంగా 59,408 వాహనాలకు చేరాయి. త్రైమాసికాలవారీగా  ఇది అత్యధికం.  

లక్ష పైగా వాహనాల ఉత్పత్తికి బ్రేక్‌ ..
ప్రధానంగా దేశీ మోడల్స్‌కు సంబంధించి.. ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల కొరత కారణంగా దాదాపు 1.16 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి 2 లక్షల పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. డెలివరీలను వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని పేర్కొంది. ‘గడిచిన ఏడాది వ్యవధిలో చూస్తే.. ఈ త్రైమాసికంలో ఉక్కు, అల్యూమినియం, ఇతరత్రా విలువైన లోహాల ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ముడి వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాన్ని వీలైనంత అధికంగా భరించేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేసింది. కార్ల ధరలు పెంచినా.. వినియోగదారులకు స్వల్ప భారాన్నే బదలాయించింది. నికర లాభం క్షీణించడానికి ఇది కూడా కారణం‘ అని మారుతీ సుజుకీ తెలిపింది.  

సవాళ్లమయంగా రెండో త్రైమాసికం..
క్యూ2 అత్యంత సవాళ్లమయంగా సాగిందని ఆన్‌లైన్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. ఏడాది ప్రారంభంలో కంపెనీ ఊహించని అనూహ్యమైన పరిణామాలు, సవాళ్లు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ‘రెండో త్రైమాసికంలో కరోనా పరిస్థితి మరీ తీవ్రంగా లేదు. కానీ సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత .. కమోడిటీల ధరలు అసాధారణంగా పెరిగిపోవడం వంటి అంశాలు మా ముందస్తు అంచనాలను తల్లకిందులు చేశాయి‘ అని భార్గవ తెలిపారు.

రెండంకెల వృద్ధి ఉండదు..
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా వ్యవధిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెప్పడం ప్రస్తుతం చాలా కష్టమని భార్గవ చెప్పారు. కమోడిటీల ధరలు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాల సరఫరాలను అంచనా వేయడం అంత సులభంగా లేదన్నారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొందని, ఎవరూ దీర్ఘకాలిక సరఫరాల గురించి ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారని భార్గవ తెలిపారు.

నాలుగేళ్ల తర్వాతే ఎలక్ట్రిక్‌ వాహనం
ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ అంతగా లేదని, 2025 తర్వాతే దేశీయంగా వీటిని తాము ప్రవేశపెట్టే అవకాశం ఉందని భార్గవ చెప్పారు. తాము ఈ విభాగంలోకి  ప్రవేశిస్తే నెలకు కనీసం 10,000 యూనిట్లయినా విక్రయించాలని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం బ్యాటరీలు, చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ సరఫరా వంటివి ఇతర సంస్థల చేతుల్లో ఉన్నందున.. ధరను నిర్ణయించడం తమ చేతుల్లో లేదన్నారు. ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెట్టడంపై మాతృ సంస్థ సుజుకీదే తుది నిర్ణయమని చెప్పారు. 2020లో ఎలక్ట్రిక్‌ వేగన్‌ఆర్‌ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, వివిధ ప్రతికూలతల కారణంగా దాన్ని పక్కన పెట్టింది.

Advertisement
Advertisement