నిర్మాణ ప్లాన్స్‌లో డిజిటల్‌ ఇన్‌ఫ్రాను చేర్చాల్సిందే!

Make digital infra mandatory in building plans, Trai tells govt - Sakshi

రెరా చట్టంలో నిబంధనలు చేర్చాలి  

ప్రభుత్వానికి ట్రాయ్‌ సిఫార్సులు

న్యూఢిల్లీ: భవంతుల నిర్మాణ ప్రణాళికల్లో నీరు, విద్యుత్, గ్యాస్‌ మొదలైన వాటికి సదుపాయాలు కల్పించినట్లుగానే డిజిటల్‌ కనెక్టివిటీ ఇన్‌ఫ్రా (డీసీఐ)కి కూడా చోటు కల్పించాలని ప్రభుత్వానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సూచించింది. డీసీఐ కల్పన, నిర్వహణ, అప్‌గ్రెడేషన్‌ తదితర అంశాలను కూడా తప్పనిసరిగా పొందుపర్చేలా చూడాలని సూచించింది. ఇందుకోసం రియల్‌ ఎస్టేట్‌ చట్టం రెరాలో తగు నిబంధనలను చేర్చాలని పేర్కొంది.

‘డిజిటల్‌ కనెక్టివిటీకి సంబంధించి భవంతులకు రేటింగ్‌’ అంశంపై ప్రభుత్వానికి ఈ మేరకు ట్రాయ్‌ సిఫార్సులు చేసింది. అపార్ట్‌మెంట్లు లేదా రియల్టీ ప్రాజెక్టుల్లో ఏదో ఒక నిర్దిష్ట టెల్కో గుత్తాధిపత్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వైర్‌లెస్‌ పరికరాలను ఇన్‌స్టాల్‌ చేయడం టెలికం లేదా ఇంటర్నెట్‌ సర్వీస్‌ లైసెన్సు హోల్డర్‌ బాధ్యతగా ఉంటుందని ట్రాయ్‌ తెలిపింది. బిల్డింగ్‌ల్లో డీసీఐ ప్రస్తుత ప్రమాణాలు, ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)కు అప్పగించాలని పేర్కొంది.  

డిజిటల్‌ సేవల పటిష్టంపై త్వరలో చర్చాపత్రం  
దేశీయంగా డిజిటల్‌ సేవలను మరింత పటిష్టం చేసేందుకు, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోదగిన చర్యలపై కూడా ట్రాయ్‌ దృష్టి సారిస్తోంది. డివైజ్‌లు, కనెక్టివిటీ, డిజిటల్‌ అక్షరాస్యతపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని రాబోయే నెలల్లో విడుదల చేయనున్నట్లు ఇండియా డిజిటల్‌ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ట్రాయ్‌ చైర్మన్‌ పీడీ వాఘేలా తెలిపారు. దేశవ్యాప్తంగా టెల్కోలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డివైజ్‌ల రేట్లు అధికంగా ఉన్నాయని సామాన్య ప్రజానీకం భావిస్తున్న నేపథ్యంలో వాఘేలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వచ్చే 25 ఏళ్లలో దేశీయంగా డిజిటల్‌ వినియోగాన్ని వేగవంతం చేయాలంటే డిజిటల్‌ గవర్నెన్స్‌ మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీపై విధానాల రూపకల్పన వంటి ఎనిమిది కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని వాఘేలా చెప్పారు. ప్రజోపయోగకరమైన ఆధార్, యూపీఐ, డిజిలాకర్‌ వంటి డిజిటల్‌ వ్యవస్థలతో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు మన దేశ పరిస్థితులకు ఉపయోగపడేలా వినూత్న డిజిటల్‌ ఆవిష్కరణలను రూపొందించాల్సిన అవసరం ఉందని వాఘేలా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top