ఆచితూచి... ఐపీఓలకు! | The IPO Party is Over High Hype and Low Returns Drive Small Investors Away | Sakshi
Sakshi News home page

ఆచితూచి... ఐపీఓలకు!

Mar 30 2026 7:50 AM | Updated on Mar 30 2026 8:34 AM

The IPO Party is Over High Hype and Low Returns Drive Small Investors Away

కొన్నాళ్లుగా ‘వేచి చూసే ధోరణిలో’ రిటైలర్లు

లిస్టింగ్‌ లాభాలకు ఆశపడ్డవారంతా దూరం

గత ఐపీఓల్లో నష్టపోవటమే ప్రధాన కారణం

హైప్‌ ఎక్కువగా ఉండే ఇష్యూలకు నో

గతంలో అతివృష్టి... ఇప్పుడు అనావృష్టి

ఏడాది వ్యవధిలో మారిన తీరు

గత ఏడాది ఐపీవోల జోరు మామూలుగా లేదు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు పండుగలా అనిపించింది. చాలా మటుకు ఇష్యూలు లిస్టింగ్‌ రోజున భారీగానే లాభాలు ఇచ్చాయి. దీనితో ఏ కంపెనీ ఇష్యూ వచ్చినా 50రెట్లు.. 100 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయిపోయేవి. లిస్టింగ్‌ లాభాల కోసం అప్లై చేసుకోవడమనేది ఒక వ్యూహంగా మారిపోయింది. కానీ ఇప్పుడు అదే రిటైల్‌ ఇన్వెస్టర్లు.. ఐపీవో అంటే వెనక్కి తగ్గుతున్నారు. ఇష్యూలు పూర్తిగా సబ్ర్‌స్కయిబ్‌ కావడం లేదు. లిస్టింగ్‌లు నిరాశపరుస్తున్నాయి. ధీమా దెబ్బతింది. అందుకేనేమో! తాజాగా ఐపీఓకి వచ్చిన ప్రభుత్వ సంస్థ కోల్‌ ఇండియా అనుబంధ కంపెనీని సైతం రిటైలర్లు పట్టించుకోలేదు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం సెంటిమెంటే. 2025లో ఐపీఓలు విజయవంతం కావడానికి ఇదే సెంటిమెంటు కారణమయితే... ఇప్పుడు రిటైలర్లు చాలా ఐపీఓలకు దూరంగా ఉండటానికి కూడా సెంటిమెంటే కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కొన్ని ఐపీఓల్లో రిటైర్లు తక్కువమంది ఇన్వెస్ట్‌ చేసినా... వారు కంపెనీల ఫండమెంటల్స్‌ చూసే ముందుకొస్తున్నారనే భావన ఉంది. ఏడాది వ్యవధిలోనే పరిస్థితి ఎందుకిలా మారిపోయింది? దీనికి కారణాలేమిటి? చిన్న ఇన్వెస్టర్ల ఆలోచనేంటి? ఏం చేస్తే బెటర్‌? అనే అంశాలసమాహారమే ఈ ‘సాక్షి’ వెల్త్‌ స్టోరీ... – సాక్షి, వెల్త్‌

గతంలో ఐపీవో లిస్టయ్యిందంటే చాలు తక్కువలో తక్కువగా 20 శాతం నుంచి 50 శాతం వరకు లాభాలు పక్కా అనే విధంగా ఉండేది. అందుకే రిటైలర్ల విభాగంలో ఒక్కో ఇష్యూ 50 రెట్లు, 100 రెట్లు ఓబర్‌ సబ్ర్‌స్కయిబ్‌ అయ్యేది. నిజానికిలా ఓవర్‌ సబ్‌్రస్కయిబ్‌ అయినపుడు నూటికి 90 శాతం మందికి షేర్లు అలాట్‌ కావు. కానీ... అలాట్‌ అయితే లాభాలొస్తాయి కదా అనే ఆశతో ఒక్కొక్కరూ తమ కుటుంబీకులకు ఎన్ని ఖాతాలుంటే అన్ని ఖాతాల్లోనూ దరఖాస్తు చేసేవారు. కొద్దిరోజులు తమ క్యాపిటల్‌ లాకిన్‌లో ఉండటానికి కూడా ఇష్టపడేవారు. చివరికి అలాట్‌ అయి లిస్టింగ్‌ లాభాలొస్తే హ్యాపీ. కాదంటే నిట్టూర్పు. కానీ ఇటీవల చాలా ఐపీఓలు లిస్టింగ్‌లో పెద్దగా లాభాలివ్వలేదు. ఇష్యూ ధరకు సమానంగా ఫ్లాట్‌గానో లేకపోతే ఒక్కోసారి అంతకన్నా తక్కువకే లిస్టవుతున్నాయి. దీనితో ఐపీవోలో అలాట్‌ అయితే చాలు లాభాలు గ్యారంటీ అనే అభిప్రాయం తొలగిపోయింది.

ఓవర్‌ప్రైసింగ్‌..
చాలా మటుకు కంపెనీలు తమ అసలు వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ఐపీవోలకు ధర నిర్ణయిస్తున్నాయి. బులిష్‌ సెంటిమెంటుని క్యాష్‌ చేసుకుని, బయటపడిపోయేందుకు ప్రమోటర్లు ప్రయతి్నస్తున్నారనే అపవాదు ఉంది. చాలా ఐపీఓల పరిస్థితి ఇదే అయినా... ఇటీవల లెన్స్‌కార్ట్‌ వంటి ఐపీఓలపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి కూడా. అందుకే రిటైల్‌ ఇన్వెస్టర్లకి ఇలాంటి వాటిల్లో ఎంట్రీ చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని, రాబడులపై స్పష్టత ఉండదని అర్థమవుతోంది.  

లిస్టింగ్‌కి ముందు.. తర్వాత..
కొన్ని కంపెనీల లెక్కల మాయాజాలమో, యాదృచ్ఛికమో అర్థం కావటం లేదు కానీ.. ఐపీఓకి రావటానికి ముందు ఒకటి రెండేళ్లు అద్భుతమైన పనితీరును చూపిస్తున్నాయి. అంతకుముందు చాలా ఏళ్లు ఆ పరిస్థితి లేకపోవటం గమనార్హం. దీంతో ఆ రెండేళ్ల లెక్కలను చూపిస్తూ.. భవిష్యత్తు సూపర్‌ అంటూ ఊదరగొడుతున్నాయి. అది నమ్ముకుని కొనుక్కుంటే, ఆ తర్వాత వాస్తవం బోధపడుతోంది. లిస్టింగ్‌ అయిన తర్వాత ఎరి్నంగ్స్‌ తీరు చూస్తే భయపెట్టేదిగా ఉంటోంది. ఇటీవల కొన్ని డ్రోన్‌ కంపెనీలు ఇదే బాగోతాన్ని కళ్లకుకట్టాయి.

మారిన మార్కెట్‌ పరిస్థితులు
ఇరాన్‌ యుద్ధ ప్రభావం కావచ్చు,. అంతకుముందు అమెరికా టారిఫ్‌ల వ్యవహారం కావచ్చు. ఇవన్నీ మార్కెట్లను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఒకటి తరువాత ఒకటిగా చుట్టుముడుతున్న అంతర్జాతీయ పరిణామాలతో ఎఫ్‌ఐఐలు భారత మార్కెట్లలో తమ షేర్లను అమ్ముతూనే వస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో జరిపిన అమ్మకాలకు దీటుగా దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేసినప్పటికీ... ఇపుడు తాజా ఇరాన్‌ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. మార్కెట్లు భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ఇక లిక్విడిటీ కూడా కష్టంగా మారుతుండటంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు స్పెక్యులేషన్‌ కన్నా క్షేమంగా ఉండటమే మిన్న అనే ధోరణికి ప్రాధాన్యం ఇస్తున్నారు.  

మరేం చెయ్యాలి?
పరిస్థితులు ఇలా మారినంత మాత్రాన ఐపీవో మార్కెట్‌ మొత్తానికే కుప్పకూలిందనుకోవడానికి లేదు. తాజాగా వస్తున్న ఐపీఓల్లో రిటైలర్ల పాత్ర తగ్గినా పూర్తిగా పోలేదు. కొన్ని ఇష్యూల్లో ఫండ్లతో పాటు పెద్ద ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇది మార్కట్‌పై, సదరు కంపెనీలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి. ఈ వ్యవహారంపై దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ దిగ్గజం ఒకరు స్పందిస్తూ... ‘‘గతంలో అందరికీ డబ్బులొచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని విషయాలు క్షుణ్నంగా తెలుసుకుని, ముందడుగు వేసే ఇన్వెస్టర్లకే వస్తున్నాయి. అది రిటైల్‌ ఇన్వెస్టర్లయినా... హెచ్‌ఎన్‌ఐలయినా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement