పన్నులు తగ్గిస్తే.. పరిధి పైపైకి!

Insurance Companies Says To Central Government Reduce GST - Sakshi

బీమా ప్లాన్లపై రాయితీలు పెంచాలి 

ఎన్‌పీఎస్‌ మాదిరే ప్రయోజనాలివ్వాలి 

జీఎస్‌టీని తగ్గించాలి 

కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన బీమా పరిశ్రమ 

న్యూఢిల్లీ: బీమా పాలసీలపై పన్నుల భారాన్ని తగ్గిస్తే.. వాటి ధరలు అందుబాటులోకి వచ్చి మరింత మందికి చేరువ అవుతాయంటూ ఈ రంగం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. బడ్జెట్‌ ముందస్తు సూచనల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ ముందు పలు డిమాండ్లను వినిపించింది. 2021–22 బడ్జెట్‌లో పన్ను రాయితీలను ప్రకటించాలని, దాంతో బీమా ప్లాన్‌లు మరింత ఆకర్షణీయంగా మారతాయని జీవిత బీమా పరిశ్రమ కోరింది. సెక్షన్‌ 80సీ కింద బీమా ఉత్పత్తులకు మరింత పన్ను మినహాయింపులను ప్రత్యేకించాలని.. దాంతో పన్ను ఆదా సాధనంగా వీటిని మరింత మంది కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారంటూ వివరించింది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఈ సెక్షన్‌ కింద గరిష్టంగా రూ.1.5లక్షల ఆదాయానికే పన్ను మినహాయింపు పొందగలరు. దీన్ని రూ.2లక్షలకు పెంచాలని లేదా బీమా ప్రీమియం చెల్లింపుల కోసం ప్రత్యేక ఉప పరిమితిని అయినా తీసుకురావాలంటూ ఈ పరిశ్రమ కోరింది.  

ప్రత్యేక విభాగం..: జీవిత బీమా పాలసీలకు చేసే చెల్లింపులపై పన్ను ప్రయోజనాల కోసం రానున్న బడ్జెట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నట్టు ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డైరెక్టర్‌ సంజయ్‌ తివారీ తెలిపారు. మోటారు బీమా, టర్మ్, యూనిట్‌ లింక్డ్‌ (యులిప్‌) ప్లాన్లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ రేటు అమల్లో ఉంది. ఎండోమెంట్‌ ప్లాన్లను సేవింగ్‌ సాధనంగా పరిగణిస్తూ వీటికి సంబంధించి మొదటి ఏడాది ప్రీమియంపై 4.5 శాతం, తర్వాతి సంవత్సరం నుంచి 2.25 శాతం జీఎస్‌టీని అమలు చేస్తున్నారు. సింగిల్‌ ప్రీమియం యాన్యుటీ ప్లాన్లపై జీఎస్‌టీ 1.8 శాతంగా ఉంది.

ఎన్‌పీఎస్, బీమా ఉత్పత్తుల మధ్య పన్నుల పరంగా అంతరం ఉంది. దీంతో ఎన్‌పీఎస్‌తో పోల్చినప్పుడు పెన్షన్‌/యాన్యుటీ ప్లాన్ల విషయంలో ఒకే హోదా కల్పించాలని బీమా కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5లక్షలకు అదనంగా.. సెక్షన్‌ 80సీసీడీ కింద ఎన్‌పీఎస్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల పెట్టుబడులపై పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంది. ఇదే విధమైన ప్రయోజనాలను బీమా కంపెనీలు ఆఫర్‌ చేస్తున్న రిటైర్మెంట్‌ ప్లాన్లపై అందించాలని కోరుతున్నట్టు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో కామేష్‌రావు తెలిపారు.  స్విస్‌ ఆర్‌ఈ డేటా ప్రకారం.. దేశంలో బీమా తలసరి ప్రీమియం 2019–20లో 78 డాలర్లు (రూ.5,850)గా ఉంటే, అంతర్జాతీయంగా ఇది 818 డాలర్లు (రూ.61,350)గా ఉంది. బీమా వ్యాప్తి (జీడీపీలో ప్రీమియం శాతం) 2019–20లో 3.76 శాతంగా ఉంది. జీవిత బీమా వ్యాప్తి దేశీయంగా 2.82 శాతంగా ఉంటే, అంతర్జాతీయ సగటు 3.55%.  

ఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాలి.. 
‘‘ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం తన వ్యయాలను బడ్జెట్‌లో ప్రస్తుతమున్న 1.2% నుంచి కనీసం 2.5%కి అయినా వచ్చే మూడేళ్ల కాలంలో పెంచాల్సి ఉంది. ఇందులో అధిక భాగం నిధులను ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆధునికీకరణకు వినియోగించాలి. ఈ దిశగా 2021–22 బడ్జెట్‌ తొలి అడుగు వేస్తుందని ఆశిస్తున్నాము’’ అని మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఎండీ, సీఈవో దిలీప్‌ జోస్‌ తెలిపారు.

ఈ కామర్స్‌కీ చేయూత 
దేశంలో ఏటేటా భారీగా విస్తరిస్తున్న ఈ కామర్స్‌ రంగానికీ వచ్చే బడ్జెట్‌లో కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ కామర్స్‌ దిగుమతులు, ఎగుమతులకు ఒకే విడతలో పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వడం ఇందులో భాగంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘దేశంలో ఈ కామర్స్‌ రంగం (ఆన్‌లైన్‌ వేదికలపై విక్రయాలు నిర్వహించే సంస్థలు) ఎన్నో రెట్లు వద్ధి చెందింది. దీంతో భారీ మొత్తంలో దిగుమతులు చేసుకుంటూ.. తిరిగి భారత్‌ నుంచి ఎగుమతులు చేస్తుండడంతో నియంత్రణ, సదుపాయాల పరంగా సమతుల్యత అవసరం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

వ్యవసాయానికి భారీ రుణ సాయం! 
రూ.19లక్షల కోట్లకు పెంచే అవకాశం 
న్యూఢిల్లీ: దేశంలో రైతు ఆదాయాన్ని 2020 నాటికి రెట్టింపును చేయాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర సర్కారు.. ఇందు కోసం సాగు రంగానికి రుణ వితరణ (క్రెడిట్‌) లక్ష్యాన్ని రూ.19లక్షల కోట్లకు పెంచనుంది. ఫిబ్రవరి 1న తీసుకురానున్న బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగానికి క్రెడిట్‌ లక్ష్యాన్ని కేంద్రం రూ.15లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా.. దీంతో పోలిస్తే 35 శాతానికి పైగా పెరగనుంది. నిజానికి ఏటా సాగు రంగానికి రుణ లక్ష్యాన్ని కేంద్రం పెంచుతూ వస్తోంది. అంతేకాదు, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి రుణ వితరణ కూడా నమోదవుతోంది. 2017–18 సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా, రూ.11.68 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. అలాగే, 2016–17లోనూ రూ.9లక్షల కోట్ల లక్ష్యాన్ని మించి.. రూ.10.66 లక్షల కోట్లకు పెరిగింది.  

నామమాత్రపు వడ్డీ...
వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలపై 9 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. దీనిపై కేంద్రం రాయితీలు ఇస్తోంది. 2 శాతం రాయితీపోగా 7 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తే చాలు. అది కూడా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించేస్తే మరో 3 శాతాన్ని ప్రోత్సాహకంగా అందిస్తోంది. వెరసి నికర వడ్డీ రేటు 4 శాతమే అవుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top