వాహన బీమా క్లెయిమ్‌లను సాంకేతిక కారణాలు, చిన్నపాటి లొసుగుల సాకుతో తిరస్కరించే కార్పొరేట్ కంపెనీల ధోరణికి వినియోగదారుల కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ‘కారు డ్యామేజ్ అయిన విధానం, యజమాని చెబుతున్న కథనానికి సరిపోలడం లేదు’ అనే కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరించిన ప్రముఖ బీమా సంస్థ బజాజ్ అలియాంజ్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. పాలసీ నిబంధనల ప్రకారం వాహన యజమానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు అదనపు ఖర్చులు చెల్లించాలని ఆదేశిస్తూ చండీగఢ్ వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ తీర్పును వెలువరించింది.
అసలు ఏం జరిగిందంటే..?
నగరానికి చెందిన విక్రమ్‌జీత్ సింగ్ అనే కారు యజమాని తన లగ్జరీ కారుకు బజాజ్ అలియాంజ్ సంస్థ నుంచి బీమా పాలసీ తీసుకున్నారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు, నష్టపరిహారం కోసం ఆయన కంపెనీకి క్లెయిమ్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, బీమా సంస్థ నియమించిన సర్వేయర్ కారును పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుకు, కారుపై ఉన్న డ్యామేజ్ గుర్తులకు పొంతన లేదంటూ నివేదిక ఇచ్చారు. ఈ సాకుతో కంపెనీ క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరించింది. న్యాయం కోసం సదరు యజమాని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. తన కారుకు ఇన్సూరెన్స్ రక్షణ ఉన్నప్పటికీ కంపెనీ ఉద్దేశపూర్వకంగానే తన క్లెయిమ్ తిరస్కరించిందని కోర్టుకు వివరించారు.
కోర్టు ఆగ్రహం..
రెండు వైపుల వాదనలు విన్న వినియోగదారుల ఫోరమ్.. బీమా కంపెనీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. టెక్నికల్ గ్రౌండ్స్‌ను చూపిస్తూ నమ్మకంగా ఉంటున్న కస్టమర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ‘బీమా కంపెనీలు కేవలం ప్రీమియంలు వసూలు చేయడానికే పరిమితం కాకూడదు. కస్టమర్ నిజంగా నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత వాటిపై ఉంది. సర్వేయర్ నివేదికను సాకుగా చూపి క్లెయిమ్‌ను తిరస్కరించడం వినియోగదారుల హక్కులను కాలరాయడమే’ అని కోర్టు తెలిపింది.
ఫోరమ్ జారీ చేసిన ఉత్తర్వులు
పాలసీ ఐడీవీ (ఇన్‌స్యూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ) నిబంధనల ప్రకారం వాహన యజమానికి రూ.20 లక్షల క్లెయిమ్ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలి.
వినియోగదారుడు అనుభవించిన మానసిక క్షోభకు నష్టపరిహారంగా, కస్టమర్‌ను ఇబ్బందులకు గురిచేసినందుకు గానూ రూ.50,000 అదనంగా చెల్లించాలి.
కోర్టులో వ్యాజ్యం నడిపినందుకు అయ్యే ఖర్చుల కింద మరో రూ.10,000 యజమానికి అందజేయాలి.
కంపెనీలు క్లెయిమ్స్ తిరస్కరించినప్పుడు చాలామంది వాహనదారులు వెనకడుగు వేస్తుంటారు. కానీ, సరైన ఆధారాలు ఉండి కంపెనీ వైపు లోపాలు ఉంటే వినియోగదారుల ఫోరమ్‌ల ద్వారా న్యాయం ఎలా పొందవచ్చో చెప్పడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని లీగల్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..


