వారానికి నాలుగు రోజులే ఆఫీస్‌.. తెరపైకి కొత్త పాలసీ

This Indian IT Company Shifts to 4 Day Work Week - Sakshi

4 - Day Work Week : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్టు దిగిందా, లేదా...  సూపర్‌హిట్‌ మూవీ పోకిరిలో పాపులర్‌ డైలాగ్‌. ఈ సినిమాతో సంబంధం లేకపోయినా ఉద్యోగుల్లో ఇలాంటి స్ఫూర్తినే నింపుతోంది ఓ ఇండియన్‌ కంపెనీ. ఎంత సేపు పని చేశామన్నది కాదు క్వాలిటీ వర్క్‌ ఉందా లేదా అంటోంది. అందులో భాగంగానే ఇండియాలో ఇంత వరకు లేని వర్క్‌  కల్చర్‌ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేక వర్క్‌ఫ్రం హోం కంటిన్యూ చేయాలా అనే విషయంపై అనేక కంపెనీలు కిందా మీద పడుతున్నాయి. వర్క్‌ఫ్రం హోంపై ఓ క్లారిటీ ఇంకా రాకముందే తాజాగా వారానికి నాలుగు పని దినాల కాన్సెప్ట్‌ని టీఏసీ సెక్యూరిటీస్‌ సంస్థ తెర మీదకు తెచ్చింది. 

ఉద్యోగులు ఏమన్నారంటే
ఆఫీసులో పనితీరు, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాలపై ఇటీవల టీఏసీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అందులో చాలా మంది ఆఫీసు జీవితంలో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయడం కష్టంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎప్పుడూ ఆఫీసులో గంటల తరబడి పనిలో ఉంటే పనిలో ఉత్సాహం, ఉత్తేజం లోపిస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకునేందుకు వీకెండ్స్‌ సరిపోతున్నాయంటూ చెప్పారు. 

లాంగ్‌ వీకెండ్‌
ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా టీఏసీ యాజమాన్యం కొత్త ప్రతిపాదన ఉద్యోగుల ముందుకు తెచ్చింది. వారానికి ఐదు లేదా ఆరు రోజుల పని, రోజుకు ఎనిమిది గంటలు వంటి విధానాలు పక్కన పెట్టాలని నిర్ణయించింది. వారానికి నాలుగు పని దినాలు, లాంగ్‌ వీకెండ్‌ ఉండేలా కొత్త టైం టేబుల్‌ సిద్ధం చేసింది. వర్క్‌ లోడ్‌ను బట్టి పని దినాల్లో లాంగ్‌ అవర్స్‌ పని చేయాల్సి ఉంటుందని ఉద్యోగుల ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల్లో 80 శాతం మంది వీటికి ఓకే చెప్పారు. దీంతో అర్జంటుగా వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలుకు శ్రీకారం చుట్టింది.


టార్గెట్‌ రీచ్‌ అయితే చాలు
వ్యక్తిగత జీవితం ఆనందంగా ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ఉద్యోగుల నుంచి ఎక్కువ అవుట్‌ పుట్‌ వస్తుంది. అందుకే వారు లాంగ్‌ వీకెండ్‌, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే ఈ ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తున్నాం. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆశిస్తున్నట్టు టీఏసీ ఫౌండర్‌ త్రిష్నీత్‌ తెలిపారు. ఉద్యోగులు ఎన్ని రోజులు ఎన్ని గంటలు పని చేశారన్నది మాకు ముఖ్యం కాదు. మేం పెట్టుకున్న గడువులోగా పని జరిగిందా లేదా అన్నదే మాకు ప్రధానం అని ఆయన అన్నారు. 

ఉద్యోగుల్లో ఆనందం
టీఏసీ సీఈవో త్రిష్నిత్‌ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఆసక్తి నెలకొంది. ఈ కొత్త ప్రయోగం తీరు తెన్నులు పరిశీలిస్తున్నాయి. మరోవైపు టీఏసీ ఉద్యోగులు ‘కొలంబస్‌ కొలంబస్‌ ఇచ్చారు సెలవు... ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అన్నట్టుగా జోష్‌లో ఉన్నారు. 

టీఏసీ మొదలు పెట్టింది
స్టార్టప్‌గా మొదలై రాబోయే మూడేళ్లలో వన్‌ బిలియన్‌ డాలర్‌ కంపెనీగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తోన్న టీఏసీ సెక్యూరిటీ సొల్యూషన్‌ సంస్థ 4 డే వర్క్‌ వీక్‌ కాన్సెప్టుని తెర మీదకి తెచ్చింది. 2013లో ఈ సం‍స్థని త్రిష్నీత్‌కి అరోరా స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 5 మిలియన్‌ డాలర్లు ఉండగా 2025 కల్లా వన్‌ బిలియన్‌ డాలర్లు సంస్థగా ఎదుగుతామంటూ ఇటీవల అరోరా ప్రకటించారు.

వీడు సామాన్యుడు కాదు
టీఏసీ సెక్యూరిటీస్‌ సీఈవో త్రిష్నీత్‌కి వినూత్నంగా ఆలోచిస్తాడనే పేరు బిజినెస్‌ సర్కిల్‌లో ఉంది. స్కూల్‌ఏజ్‌లో బ్యాక్‌ బెంచర్‌గా ఉంటూ మిడిల్‌ డ్రాప్‌ అయ్యాడు. ఫ్యామిలీలో ఎవరికి కంప్యూటర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే కేవలం 19 ఏళ్ల వయస్సులో టీఏసీ సెక్యూరిటీస్‌ సంస్థను 2013లో స్థాపించాడు. ఎంట్రప్యూనర్‌గా ఉంటూనే హ్యకింగ్‌పై పలు పుస్తకాలు కూడా రాశాడు. సైబర్‌ సెక్కూరిటీకి సంబంధించి గుజరాత్‌, పంజాబ్‌ పోలీసు శాఖలతో కలిసి త్రిష్నీత్ పని చేస్తున్నాడు. టీఏసీ క్లయింట్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఉంది.2018లో ప్రఖ్యాత ఫోర్బ్ప్‌ ప్రచురించిన అండర్‌ 30 ఏషియా లిస్టులో త్రిష్నీత్‌కి చోటు దక్కింది.

చదవండి : ర్క్‌ఫ్రమ్‌ హోమ్‌: కంపెనీల కొత్త వ్యూహం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top