భారత్‌కు భారీ ఎఫ్‌డీఐలు: గోయల్‌

India received record FDI in last 7 years - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వస్తున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య ఎఫ్‌డీఐలు 62 శాతం పెరిగి 27 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. గడచిన ఏడు సంవత్సరాలుగా ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌ మంచి ఫలితాలు సాధించిందని, ఇదే ధోరణి ఇక ముందూ కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.  2021– బహుళజాతి సంస్థలు (ఎన్‌ఎన్‌సీ) అనే అంశంపై ఇండస్ట్రీ బాడీ సీఐఐ నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ మేరకు ఆయన ప్రసంగించారు.

యూఏఈ, ఆస్ట్రేలియాలతో త్వరలో ఎఫ్‌టీఏలు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ)లపై గోయల్‌ మాట్లాడుతూ, యుఏఈ, ఆస్ట్రేలియా, యూకే, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), ఇజ్రాయెల్, జీసీసీ (గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌)) గ్రూప్‌తో సహా పలు దేశాలతో భారత్‌ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. రానున్న 60 నుంచి 100 రోజుల్లో యూఏఈ, ఆస్ట్రేలియాలతో ఎఫ్‌టీఏలకు సంబంధించి కీలక అవగాహనలకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులకు బహుళజాతి కంపెనీలు భారత్‌ను స్థావరంగా ఎంచుకోవాలని, తద్వారా అధిక వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు పొందాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌టీఏ కింద, రెండు భాగస్వామ్య దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గిస్తాయి. లేదా తొలగిస్తాయి. సేవలలో వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి, పెట్టుబడులను పెంచుకోడానికి కూడా ఆయా దేశాలు  నిబంధనలను సరళీకరిస్తాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top