ఆహార సేవల మార్కెట్‌ @ 80 బిలియన్‌ డాలర్లు

India food service market to reach 79. 65 billion dollers by 2028 - Sakshi

2028 నాటికి అంచనా

ఏటా 11 శాతం వృద్ధి

ఫ్రాంకార్ప్, రెస్టారెంట్‌ ఇండియాడాట్‌ఇన్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశీ ఆహార సర్వీసుల మార్కెట్‌ 2028 నాటికి 79.65 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం 2022లో 41.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ ఏటా 11.19 శాతం మేర వృద్ధి చెందనుంది.  ఫ్రాంకార్ప్, రెస్టారెంట్‌ఇండియాడాట్‌ఇన్‌ రూపొందించిన ఫుడ్‌ సర్వీస్, రెస్టారెంట్‌ వ్యాపార నివేదిక 2022–23లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్‌–19 మహమ్మారి తీవ్రంగా ఉన్న తరుణంలో పరిశ్రమలో 20 లక్షల పైగా ఉద్యోగాల్లో కోత పడినప్పటికీ 2025 నాటికి ఉద్యోగాల సంఖ్య 1 కోటికి చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. దీని ప్రకారం రెస్టారెంట్స్, ఫుడ్‌ సర్వీస్‌ మార్కెట్‌ను సంఘటిత, అసంఘటిత రంగాల కింద రెండు విభాగాలుగా పరిగణించారు. పరిశ్రమ వృద్ధిలో అసంఘటిత రంగ వాటా అత్యధికంగా ఉండగా.. సంఘటిత విభాగం కూడా 2014–2020 మధ్యకాలంలో పటిష్ట వృద్ధి నమోదు చేసింది.  

1.06 బిలియన్‌ డాలర్లకు క్యూఎస్‌ఆర్‌..
ప్రస్తుతం 690 మిలియన్‌ డాలర్లుగా ఉన్న క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్స్‌ (క్యూఎస్‌ఆర్‌) మార్కెట్‌ 2027 నాటికి 1.069 బిలియన్‌ డాలర్లకు చేరగలదని నివేదిక అంచనా వేసింది. ఏటా 9.15 శాతం మేర వృద్ధి చెందుతుందని పేర్కొంది. 2020–25 మధ్య కాలంలో మొత్తం ఫుడ్‌ సర్వీస్‌ మార్కెట్లోని అన్ని ఉప–విభాగాలతో పోలిస్తే క్యూఎస్‌ఆర్‌ చెయిన్‌ మార్కెట్‌ అత్యధికంగా వృద్ధి చెందనుందని వివరించింది. మెక్‌డొనాల్డ్స్, బర్గర్‌ కింగ్, డోమినోస్‌ వంటి భారీ ఫుడ్‌ సర్వీస్‌ చెయిన్స్‌.. చిన్న పట్టణాల్లోకి మరింతగా విస్తరిస్తుండటం ఇందుకు దోహదపడగలదని నివేదిక తెలిపింది. గడిచిన రెండేళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్లపై మధ్య తరగతి వర్గాలు వార్షికంగా చేసే ఖర్చు 108 శాతం పెరిగి రూ. 2,500 నుండి రూ. 5,400కు చేరింది.  

మరిన్ని వివరాలు..
► 2021లో దేశీయంగా ఫుడ్‌ సర్వీసెస్‌ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 73 లక్షల మంది పైగా ఉంది. కోవిడ్‌–19 మహమ్మారి కాలంలో ఇరవై లక్షల మేర ఉద్యోగాలు పోయినప్పటికీ 2025 నాటికి ఈ సంఖ్య 1 కోటికి చేరవచ్చని నివేదిక అంచనా వేసింది.  
► ద్రవ్యోల్బణం కారణంగా దాదాపు 51 శాతం మంది వినియోగదారులు బైట తినడాన్నో లేదా ఆర్డర్‌ చేయడాన్నో తగ్గించుకుంటున్నారు. దాదాపు 40 శాతం మంది తాము ఆర్డర్‌ చేసే ఐటమ్‌ల సంఖ్యను తగ్గించుకోవడమో లేక ఖరీదైన ఐటమ్‌లను తక్కువగా ఆర్డర్‌ చేసేందుకో మొగ్గు చూపుతున్నారు.
► కీలక ఆహార, శీతల పానీయాల సరఫరాలో జాప్యాలు లేదా కొరత మొదలైనవి పరిశ్రమకు ప్రధాన సవాలుగా ఉంటున్నాయి. 2021లో 96 శాతం ఆపరేటర్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నాయి. 2022–23లోనూ ఈ సవాళ్లు కొనసాగనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top