ITR Filling: ట్యాక్స్‌ ప్లానింగ్‌కి పది సూచనలు..

Income Tax Return filing: 10 important things individual taxpayers must know before filing ITR - Sakshi

సాధారణంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌ నెలల్లో అందరూ ట్యాక్స్‌ ప్లానింగ్‌ గురించి ఆలోచిస్తారు. 31–03–22తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరం విషయంలో ఆలోచనలు చేసి, అమలుపర్చాల్సిన సమయం ఇదే. ఆలస్యం చేయకండి. ట్యాక్స్‌ ప్లానింగ్‌నే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌ అని కూడా అనవచ్చు. ఇలా ప్లానింగ్‌ చేయడం వల్ల రాజమార్గంలో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. పన్నును ఎగవేయకూడదు కానీ.. ప్లానింగ్‌ ద్వారా పన్నుని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్‌ ప్లానింగ్‌ గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు.. 
 
1.    మీరు ఏ ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్‌ చేస్తారో ఆ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 
2.    ఒక సంవత్సరంలో చేస్తే, ఆ తరువాత సంవత్సరంలో ఎటువంటి మినహాయింపు రాదు. 
3.    ట్యాక్స్‌ ప్లానింగ్‌ నూటికి నూరు పాళ్లు చట్టరీత్యా ఆమోదయోగ్యమైనది. 
4.    చట్టంలోని లొసుగులు ఆసరాగా తీసుకుని పన్ను భారం లేకుండా చేసుకోవడం.. తగ్గించుకోవటం తప్పు. ఉదాహరణకు దొంగ క్లెయిములు, నకిలీ పత్రాలు సృష్టించి క్లెయిమ్‌ చేయడం, అబద్ధపు లెక్కలు చూపించడం, లెక్కలు రాయకపోవడం, అబద్ధపు ఖర్చులు రాయడం, వ్యక్తిగత ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడం.. ఇలా వంద దారులు ఉన్నాయి. కానీ, ట్యాక్స్‌ ప్లానింగ్‌కు ఒకే ఒక మార్గం .. రాజమార్గం ఉంది. 
5.    మీ ఆదాయాన్ని సక్రమ మార్గంలో సంపాదించటమే ట్యాక్స్‌ ప్లానింగ్‌కు నాంది. దానికి తగ్గట్లుగా పునాది పడితే సహజసిద్ధంగా మంచి ఆలోచనలే వస్తాయి. 
6.    మంచి ఆలోచన అంటే.. ఆ ఆలోచన/ప్లానింగ్‌ అందరికీ ఒకేలాగా ఉండదు. మార్గం ఒకటే అయినా విధివిధానాలు వేరుగా ఉంటాయి. ప్రాధాన్యతలు వేరు.. ఉదాహరణకు 80సిలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎవరి ప్రాధాన్యత, అవసరాలను బట్టి వారు ఇన్వెస్ట్‌ చేస్తారు. 
7.    వ్యాపారం, వృత్తి, స్థాయి, రెసిడెన్స్‌ స్టేటస్, వయస్సు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 
8.    కేవలం ఒక వ్యక్తి పన్ను భారం తగ్గించే ధోరణి కాకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు పిల్లల చదువులు, అమ్మాయి పెళ్లి, ఇల్లు కట్టుకోవడం మొదలైన వాటిని పేర్కొనవచ్చు. 
9.    పక్కింటి పరంధామయ్యతో మీకు పని లేదు. ఎదురింటి ఏకాంబరం గారితో ఏమీ మాట్లాడక్కర్లేదు. మీ ప్లానింగ్‌ మీదే. పోలిక వద్దు.. పోటీ వద్దు. 
10. మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చట్టప్రకారం మలచుకోండి. ఆదాయం, ఖర్చులు, ఇన్వెస్ట్‌మెంట్లు, సేవింగ్స్, పన్నులు చెల్లించటం, రిటర్నులను గడువు తేదీ లోపల వేయటం, ట్యాక్స్‌ ప్లానింగ్, కుటుంబపు ఆర్థిక పరిస్థితి స్థిరంగా, సక్రమంగా సాగేలా ప్లానింగ్‌ చేసుకోవడం ముఖ్యం. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో ట్యాక్స్‌ ప్లానింగ్‌ కూడా భాగమే.  

 కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)

చదవండి: ప‌న్ను చెల్లింపు దారుల‌కు శుభ‌వార్త‌!! రూ.ల‌క్ష‌వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌డం ఎలానో మీకు తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top