స్టార్టప్స్‌లోకి నిధుల ప్రవాహం..

Huge Investments flow into Startups‌ - Sakshi

6 నెలల్లో 12 బిలియన్‌ డాలర్ల వీసీ పెట్టుబడులు 

16 సంస్థలకు యూనికార్న్‌ల వాల్యుయేషన్‌ 

కంపెనీల కొనుగోళ్లు, ఐపీవోలతో స్టార్టప్స్‌ సందడి

న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం మరింత జోరందుకుంది. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే.. అంకుర సంస్థల్లోకి సుమారు 12.1 బిలియన్‌ డాలర్ల మేర వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) నిధులు రావడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే వ్యవధిలో స్టార్టప్‌ సంస్థల్లోకి సుమారు 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. ప్రస్తుతం దానికి రెట్టింపు స్థాయిలో నమోదు కావడం గమనార్హం. ఇటీవలే ట్యాక్సీ సేవల సంస్థ ఓలా 500 మిలియన్‌ డాలర్లు, సోషల్‌ కామర్స్‌ అంకుర సంస్థ డీల్‌షేర్‌ 144 మిలియన్‌ డాలర్లు, ఫిన్‌టెక్‌ సంస్థ పైన్‌ ల్యాబ్స్‌ 315 మిలియన్‌ డాలర్లు సమీకరించాయి. 2020 మొత్తం మీద దాదాపు 11 స్టార్టప్‌లు మాత్రమే యూనికార్న్‌ (1 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌) హోదా పొందగా ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా 16 అంకుర సంస్థలు యూనికార్న్‌ వేల్యుయేషన్‌ దక్కించుకున్నాయి. అంకుర సంస్థల్లోకి వచ్చిన వీసీ పెట్టుబడుల్లో సింహభాగం ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సెకోయా క్యాపిటల్‌ ఇండియా, టైగర్‌ గ్లోబల్, యాక్సెల్‌ ఇండియా తదితర సంస్థలు సారథ్యం వహించాయి.  

విలీనాలు.. కొనుగోళ్లు.. 
కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాకుండా స్టార్టప్స్‌ విభాగంలో భారీగా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాల డీల్స్‌ కూడా చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా యూనికార్న్‌ హోదాను దక్కించుకున్న ఫార్మ్‌ఈజీ ఇటీవలే .. లిస్టెడ్‌ కంపెనీ అయిన డయాగ్నొస్టిక్‌ సర్వీసుల సంస్థ థైరోకేర్‌లో మెజారిటీ వాటాలను రూ. 4,546 కోట్లకు కొనుగోలు చేసింది. ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ దిగ్గజం బైజూస్‌ ఏకంగా 1 బిలియన్‌ డాలర్లు వెచ్చించి ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ను దక్కించుకుంది. కొత్తగా యూనికార్న్‌ స్థాయికి ఎదుగుతున్న అప్‌గ్రాడ్‌ .. ఇలాంటి కొనుగోళ్ల డీల్స్‌ కోసం 250 మిలియన్‌ డాలర్లు పైగా కేటాయించింది. మరోవైపు, పలు అంకుర సంస్థలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీవో) సందడికి కూడా సిద్ధమవుతున్నాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీసుల సంస్థ జొమాటో అన్నింటికన్నా ముందుగా వస్తోంది. ఐపీవో ద్వారా రూ. 9,375 కోట్లు సమీకరిస్తోంది. జూలై 14న పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభమవుతోంది. ఇక ఫిన్‌–టెక్‌ దిగ్గజం పేటీఎం సైతం నవంబర్‌లో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చేందుకు సన్నాహాల్లో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి.. 
సాధారణంగా అంకుర సంస్థలకు దేశీయంగా టాప్‌ 20–30 నగరాలకు కార్యకలాపాలు విస్తరించిన తర్వాత వృద్ధి అవకాశాలు పెద్దగా ఉండటం లేదని మార్కెట్‌ పరిశీలకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పుష్కలంగా వస్తున్న నిధుల తోడ్పాటుతో ఇకపై చాలామటుకు స్టార్టప్‌ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ల వైపు దృష్టి సారించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. లిమిటెడ్‌ పార్ట్‌నర్స్, మైక్రో వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు తదితర కొత్త తరహా ఇన్వెస్టర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో స్టార్టప్‌ సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఇకపైనా కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలయన్స్‌ నివేదిక ప్రకారం 2025 నాటికి అత్యంత సంపన్న భారతీయ ఇన్వెస్టర్లు .. టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థల్లో సుమారు 30 బిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అంచనా. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top