హోండా సీబీ1000 హార్నెట్ బైకులకు రీకాల్! | Honda CB1000 Hornet SP Recalled In India | Sakshi
Sakshi News home page

హోండా సీబీ1000 హార్నెట్ బైకులకు రీకాల్!

May 10 2026 3:06 PM | Updated on May 10 2026 4:09 PM

Honda CB1000 Hornet SP Recalled In India

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) తన 'సీబీ1000 హార్నెట్ ఎస్‌పీ' మోడళ్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, ఈ ప్రభావం ఎన్ని బైకులపై పడుతుంది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2024 సెప్టెంబర్ 30 నుంచి 2025 ఆగస్టు 22 మధ్య తయారైన CB1000 హార్నెట్ SP మోడళ్లను హోండా మోటార్‌సైకిల్ స్వచ్ఛందంగా రీకాల్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఫ్యూయల్ ఫీడ్ హోస్ అమరిక, ఇంజిన్ ఆయిల్ వినియోగ స్థాయిలకు సంబంధించిన సమస్యల కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని బైకులు ఈ ప్రభావానికి లోనయ్యాయనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

రీకాల్ క్యాంపెయిన్‌లో భాగంగా, హోండా ప్రభావిత మోటార్‌సైకిళ్లను తనిఖీ చేసి, పరిష్కరిస్తుంది. ఇందులో ఫ్యూయల్ హోస్ రూటింగ్‌ను సరిచేయడం, అవసరమైతే ఇంజిన్‌కు సంబంధించిన భాగాలను మార్చడం వంటివి చేస్తుంది. సంస్థ వారంటీతో సంబంధం లేకుండా తనిఖీ, మరమ్మతులు వంటివి ఉచితంగానే చేస్తుంది.

ఏ బైకులు ఈ సమస్యకు గురయ్యాయో.. ఆ బైక్ వినియోగదారులను కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా నేరుగా సంప్రదించనుంది. అయితే వినియోగదారులు హోండా అధికారిక వెబ్‌సైట్‌లో వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN)ను నమోదు చేయడం ద్వారా, తమ మోటార్‌సైకిల్ రీకాల్ క్యాంపెయిన్ పరిధిలోకి వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు.

హోండా CB1000 హార్నెట్ SP
హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన CB1000 హార్నెట్ SP బైకును మే 2025లో లాంచ్ చేసింది. దీని ధర రూ.13.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1000 సీసీ ఇన్-లైన్-ఫోర్ ఇంజన్‌ ద్వారా 11000 rpm వద్ద 155 bhp పవర్, 9000 rpm వద్ద 107 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ వంటివి పొందుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ కావడం గమనార్హం.

ఇదీ చదవండి: నెక్సాన్ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?

Advertisement
 
Advertisement
Advertisement