హైదరాబాద్‌లో హైరైజ్‌ బిల్డింగ్స్‌ హవా 

High Rise Buildings Grow in Hyderabad Witnessing Numerous Constructions - Sakshi

హైదరాబాద్‌లో హైరైజ్‌ బిల్డింగ్స్‌ రికార్డ్‌లు బద్దలవుతున్నాయి. ఇప్పటివరకు నగరంలో అత్యంత ఎత్తయిన నిర్మాణం అంటే? కూకట్‌పల్లిలో 42 ఫ్లోర్ల లోధా బెల్లెజ్జా! 
కానీ, ఇప్పుడు? 
ఎస్‌ఏఎస్‌ ఇన్‌ఫ్రా నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్‌ దగ్గర 4 ఎకరాల్లోని 57 ఫ్లోర్ల డైమండ్‌ టవర్స్‌. ఇదే సంస్థకు చెందిన కోకాపేటలో 4.5 ఎకరాల్లోని 45 అంతస్తుల్లో క్రౌన్‌. సుమధుర గ్రూప్‌ వేవ్‌రాక్‌ దగ్గర్లో ఐదున్నర ఎకరాల్లోని 44 అంతస్తుల ఒలింపస్‌. ఇదే సంస్థ నానక్‌రాంగూడలో 56 అంతస్తుల టవర్స్‌. నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్‌ ప్రాంతంలో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ 50 ఎకరాల్లో 50 అంతస్తుల టవర్స్‌... ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఆకాశానికి నిచ్చెనలా హైరైజ్‌ బిల్డింగ్స్‌ దూసుకుపోతున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: డెవలపర్లు హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మించడానికి ప్రధాన కారణం.. ల్యాండ్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమే. నాలుగేళ్ల క్రితం కిస్మత్‌పూర్‌లో ఎకరం రూ.4 కోట్లు ఉండగా.. ఇప్పుడక్కడ రూ.30 కోట్లకు పైమాటే చెబుతున్నారని గిరిధారి హోమ్స్‌ ఎండీ కే ఇంద్రసేనా రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంత ధర పెట్టి లోరైజ్‌ నిర్మాణాలు చేపడితే డెవలపర్‌కు లాభముండదు. అందుకే భూముల ధరలు ఎక్కువగా ఉన్న చోట తక్కువ స్థలంలోనైనా సరే హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మించేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. కోకాపేట, ఖాజాగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. 

ప్రభుత్వం ఏం చేయాలంటే.. 
హైరైజ్‌ బిల్డింగ్స్‌ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్‌ అవుతాయి. ల్యాండ్‌మార్క్‌ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయి. ఎక్కువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయి. బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్‌ ఓనర్లు, ఐటీలోని వర్కింగ్‌ కపుల్స్‌ ఎక్కువగా హైరైజ్‌ బిల్డింగ్స్‌ కొనుగోలు చేస్తుంటారు. క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను పొదుపు చేయడానికి పెద్ద సైజ్‌ అపార్ట్‌మెంట్లను కొంటుంటారు. నిర్మాణం ఎత్తు పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా చ.అ.కు నిర్మాణ వ్యయం రూ.2 వేలు అయితే.. హైరైజ్‌లో రూ.3 వేల వరకు అవుతుంది. ఎందుకంటే లిఫ్టింగ్, విండ్‌ లోడ్‌ చార్జీలు, ఇంటర్నేషనల్‌ బ్రాండెడ్‌ ఉత్పత్తుల వినియోగం వంటివి ఉంటాయి కాబట్టి!  

సాధారణ భవన నిర్మాణాలతో పోలిస్తే హైరైజ్‌ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ అవసరం. పర్మిషన్‌ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం. హైరైజ్‌ బిల్డింగ్స్‌లో ఉండే ఎక్కువ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులను విస్తరించాలి. 

కట్టే దమ్ము బిల్డర్‌కు ఉందా? 
హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మించే ఆర్థిక స్థోమత డెవలపర్లకు ఉందా లేదా చూడాలి. లేకపోతే ప్రాజెక్ట్‌ మధ్యలో బిల్డర్‌ చేతులెత్తేస్తే కొనుగోలుదారులు నిలువెల్లా నష్టపోతారు. గతంలో తెల్లాపూర్‌లో ఓ నిర్మాణ సంస్థ చేపట్టిన హైరైజ్‌ బిల్డింగ్‌లో కొనుగోలుదారుల అనుభవాలే మనకు ఉదాహరణ. అందుకే అనుమతుల జారీలో ప్రభుత్వం, కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇద్దరూ.. డెవలపర్‌ గత చరిత్ర, ప్రమోటర్ల ఆర్థిక స్థోమత ఇతరత్రా ఆర్థికపరమైన అంశాల గురించి ఆరా తీయాలి. అలాగే ఆయా నిర్మాణ సంస్థకు సాంకేతిక ప్రావీణ్యం, వృత్తి నైపుణ్యం ఎంత ఉందనేది కూడా చూసుకోవాలి. 


లాభాలు ఏంటంటే? 
► ఎత్తయిన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాల్కనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన వాతావరణంలో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. 
► ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. 
► ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్‌ గ్యాప్‌ ఉండదు. 

నష్టాలు ఏంటంటే? 
► హైరైజ్‌ బిల్డింగ్‌వాసులు కసరత్తు, వ్యాయామం వంటి వాటి కోసం క్లబ్‌ హౌస్‌కు వెళ్లాలంటే బద్దకంగా ఫీలవుతుంటారు. 
► ఎత్తుకు పోయినా కొద్దీ గ్రావిటీ తగ్గి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంట్లోనే యోగా, ప్రాణాయామం చేయాలి. 
► సర్వీస్, ప్యాసింజర్‌ లిఫ్ట్‌లను వేర్వేరుగా నిర్వహణ చేయాలి.
► సాధారణ భవనాలలో కంటే హైరైజ్‌లో నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి సామగ్రి తరలించడం ఇబ్బందిగా ఉంటుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top