
కోటి రూపాయలు వెచ్చించకపోతే హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కష్టమే.. నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వ్యయాలు పెరుగుతుండటంతో ఆ మేరకు డెవలపర్లు కూడా ఇళ్ల ధరలు పెంచేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతికి సొంతింటి కల మరింత దూరమవుతుంది. అయితే ఒకవైపు ధరలు ఏ రేంజ్‌లో వృద్ధి చెందుతున్నాయో.. అంతకు రెట్టింపు స్థాయిలో లగ్జరీ గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. సిటీలో రూ.కోటి ఖర్చు పెడితే ఏ ప్రాంతంలో ఎన్ని చదరపు అడుగుల ఫ్లాట్ కొనొచ్చో సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ అధ్యయనం చేసింది. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్‌తో పాటు సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే ప్రీమియం ప్రాంతం జూబ్లీహిల్స్‌లో రూ.కోటి ఖర్చు చేస్తే కేవలం 480 చ.అ.లు మాత్రమే కొనగలం. ఇస్నాపూర్ వంటి శివారు ప్రాంతాల్లో అయితే అదే రూ.కోటికి 1,448 చ.అ. అపార్ట్‌మెంట్ సొంతం అవుతుంది. – సాక్షి, సిటీబ్యూరో
మెరుగైన మౌలిక వసతులు, ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ ఉండే ఏరియాలకు అధిక డిమాండ్ ఉంది. మెట్రో కారిడార్లు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకు సమీపంలోని ప్రాంతాల్లోని ప్రాపరీ్టలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో స్థలాల కొరతకారణంగా గృహాల సరఫరా పరిమితంగానే ఉన్నప్పటికీ కస్టమర్ల నుంచి డిమాండ్ అధికంగా ఉంది.
ఐటీ కారిడార్లలో..
కోకాపేట, నానక్‌రాంగూడ వంటి అధిక డిమాండ్ ఉన్న ఐటీ కారిడార్లలో కొనుగోలుదారులు రూ.కోటి పెడితే 617, 698 చ.అ.లను మాత్రమే కొనగలరు. నార్సింగి, తెల్లాపూర్ వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో చూస్తే.. నార్సింగిలో 772 చ.అ., శేరిలింగంపల్లిలో 764 చ.అ., ఉస్మాన్‌సాగర్‌లో 815 చ.అ., కూకట్‌పల్లిలో 842 చ.అ., రాజేంద్రనగర్‌లో 933 చ.అ., తెల్లాపూర్ లో 983 చ.అ., మియాపూర్‌లో 1,009 చ.అ.ఫ్లాట్ సొంతమవుతుంది.
విస్తారమైన ఇల్లు..
ఇక విశాలమైన ఇల్లు కావాలనుకునే కొనుగోలుదారులు మాత్రం ప్రధాన నగరం నుంచి కాస్త దూరంగా, మెరుగైన మౌలిక వసతులు ఉన్న శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే. రూ.కోటి వెచ్చిస్తే నిజాంపేటలో 1,024 చ.అ., బాచుపల్లిలో 1,059 చ.అ., పటాన్‌చెరులో 1,140 చ.అ., పోచారంలో 1,330 చ.అ., అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి.
సెలబ్రిటీలతో ధరల వృద్ధి..
మెరుగైన మౌలిక వసతులు, ఐటీ కారిడార్లకు చేరువలో ఉండటంతో పాటు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉంటుండంతో ఆయా ప్రాంతాలకు అధిక డిమాండ్ ఉంది. అలాగే అంతర్జాతీయ షాపింగ్ మాల్స్, వాణిజ్య స్థలాలు ఉండటంతో ఆయా ప్రాంతాలలో ప్రీమియం అద్దెలు చెల్లించేందుకు కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రధాన ప్రాంతాలలో ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న తూర్పు శివారు ప్రాంతాలలో ఇప్పటికీ వృద్ధి అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. స్థిరమైన అభివృద్ధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, కార్యకలాపాలపై ఈ డిమాండ్ ఆధారపడి ఉంటుంది.