భారత్‌కు ‘హార్లే’ గుడ్‌బై!

 Harley-Davidson shuts down India factory - Sakshi

హార్లే డేవిడ్సన్‌ బైక్‌ అమ్మకాలకు బ్రేక్‌...

దేశంలో ప్రస్తుత వ్యాపార నమూనా నిలిపివేత

హరియాణాలోని ప్లాంట్‌ మూసివేత

భాగస్వామి రూపంలో త్వరలో కొత్త రూట్‌

న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌ విషయమై అమెరికన్‌ కంపెనీ హార్లే డేవిడ్సన్‌ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్‌ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్‌లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు.

అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్‌లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్‌లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్‌వర్క్‌ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.

అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్‌లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్‌ వివరణ ఇచ్చింది. అయితే, భారత్‌లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్‌ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు.  

పునర్ ‌నిర్మాణంలో భాగమే
‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్‌’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్‌ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్‌వైర్‌’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్‌ తన ప్రకటనలో వివరించింది. భారత్‌ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది.

ట్రంప్‌ ఒత్తిడి..
హార్లే డేవిడ్సన్‌ బైకులపై భారత్‌ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్‌ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్‌ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్‌ కూడా చేశారు.

ఎంట్రీ.. ఎగ్జిట్‌
► 2007 ఏప్రిల్‌లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్‌ బైక్‌లు భారత మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది.  
► 2009 ఆగస్ట్‌లో హార్లే డేవిడ్సన్‌ ఇండియా కార్యకలాపాలు మొదలు
► 2010 జూలైలో మొదటి డీలర్‌షిప్‌ నియామకం, విక్రయాలు మొదలు
► 2011లో హరియాణాలోని ప్లాంట్‌లో బైక్‌ల అసెంబ్లింగ్‌ మొదలు
► విక్రయిస్తున్న మోడళ్లు: 11
► ప్లాట్‌ఫామ్‌లు: 6 (స్పోర్ట్‌స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్‌)
► 2020 సెప్టెంబర్‌లో వైదొలగాలని నిర్ణయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top