సీక్రెట్‌ బ్రౌజింగ్‌పై గూగుల్‌ నిఘా.. తెరపైకి సుందర్‌ పిచాయ్‌ పేరు!

Google Incognito Mode Google Try To Hide Issues Says California Lawsuit - Sakshi

Google Incognito Browsing Mode Alleges Tracking Users: టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతున్నా కొద్దీ.. టెక్‌ దిగ్గజాల లోటుపాట్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా ఉపయోగించే గూగుల్‌కి సంబంధించి సంచలన ఆరోపణలపై కోర్టు విచారణ కొనసాగుతుండగా.. తాజా వాదనల సందర్భంగా గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేరు ప్రస్తావనకు రావడం విశేషం. 

సెర్చింజన్‌ గూగుల్‌ క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్‌ మోడ్‌ తెలుసు కదా!. సెర్చ్‌ హిస్టరీ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. వ్యక్తిగతంగా సెర్చ్‌ చేసుకునేందుకు గూగుల్‌ యూజర్లకు కల్పించిన వెసులుబాటు ఇది. అయితే ఇందులోని సమాచారాన్ని సైతం గూగుల్‌ రహస్యంగా సేకరిస్తోందని, యూజర్‌ భద్రతకు గ్యారంటీ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కిందటి ఏడాది కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించారు.  అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగా.. గురువారం ఆరోపణలకు సంబంధించిన కీలక ఆధారాలను పిటిషనర్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్‌ అనేది సురక్షితం కాదని,  గూగుల్‌కు అన్నీ తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెడుతోందన్నది తాజా ఆరోపణ.  

సుందర్‌ పిచాయ్‌ పేరు..
2019లో గూగుల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ లొర్రాయిన్‌ ట్వోహిల్‌ నేతృత్వంలో ఓ ప్రాజెక్టు జరిగింది. ఆ ప్రాజెక్టు సమయంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్‌ మీద అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  ఇన్‌కాగ్నిటో మోడ్‌ అనే ‘ప్రైవేట్‌’ బ్రౌజింగ్‌ వ్యవస్థలో బోలెడన్ని సమస్యలున్నాయని, తనకు ఆ ఫీచర్‌ అవసరం లేదని అనిపిస్తోందని సుందర్‌ ఆ ప్రాజెక్టు సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం. యూజర్‌ను ట్రాక్‌ చేసే ఈ వ్యవస్థ వల్ల వ్యక్తిగత డేటా లీక్‌ అయ్యే అవకాశమూ లేకపోలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతపెద్ద సమస్య తెలిసి కూడా ఆయన సీక్రెట్‌ బ్రౌజింగ్‌ మోడ్‌ను ప్రమోట్‌ చేశారనేది ఆరోపణ. ఈ మేరకు గూగుల్‌ కంపెనీకి సంబంధించిన కీలక పత్రాలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు.  

మరోవైపు ఈ పిటిషన్‌పై గూగుల్‌ ప్రతినిధి జోస్‌ కాస్టానెడా స్పందించారు. సెకండ్‌, థర్డ్‌హ్యాండ్‌ అకౌంట్లకు సంబంధించిన తప్పుడు ఈమెయిల్స్‌ ద్వారా సేకరించిన సమాచారంతో గూగుల్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.  యూజర్ల వ్యక్తిగత భద్రత విషయంలో నిఘా ద్వారా ఉల్లంఘనలకు పాల్పడుతోందని గూగుల్‌ మీద ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తుండగా.. గూగుల్‌ మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్‌ ద్వారా యూజర్లకు వచ్చే ముప్పేమీ లేదని స్పష్టం చేస్తోంది.

క్లిక్‌ చేయండి: గూగుల్‌ క్రోమ్‌లో వెతుకుతున్నారా? అయితే ఈ పని చేయండి!

చదవండి: ఈ పిల్ల వయసు ఎప్పటికీ 22!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top