ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం

Published Thu, Feb 4 2021 6:19 AM

GoM to decide PSU count in strategic sectors - Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రకటించిన నాలుగు వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై మంత్రుల కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్‌) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్‌ రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ సహా మంత్రులతో ఏర్పాటుకానున్న కమిటీ ఈ నాలుగు రంగాలలో ఎన్ని పీఎస్‌యూలను కొనసాగించేదీ నిర్ణయించనున్నట్లు తెలియజేశారు.

తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు వ్యూహాత్మక రంగాలుగా ఆటమిక్‌ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్‌ సర్వీసులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ రంగాలలో సాధ్యమైనంత తక్కువగానే ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ అంశంపై నీతి ఆయోగ్‌ ప్రాథమిక జాబితాను రూపొందిస్తోంది. తద్వారా ప్రభుత్వం వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనుంది. ఇతర రంగాలను ప్రయివేటైజ్‌ చేయనుంది. తద్వారా ప్రయివేటైజ్‌ చేయనున్న కంపెనీలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.  

ఆర్‌ఐఎన్‌ఎల్‌కు కేబినెట్‌ ఓకే..: రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను ప్రయివేటైజ్‌ చేసేందుకు కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయంగా అనుమతించినట్లు పాండే తాజాగా ట్వీట్‌ చేశారు. కంపెనీలో 100 శాతం వాటాను విక్రయించేందుకు గత నెల 27న గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించారు.

ప్రైవేటీకరణ లేదా విలీనం
జాతీయ భద్రత, కీలక మౌలికసదుపాయాలు, ఇంధనం, మినరల్స్, ఫైనాన్షియల్‌ సర్వీసులను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా తాజా బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ ఎంపిక చేశారు. వీటిలో అతి తక్కువగా పీఎస్‌యూలను కొనసాగించే వీలున్నట్లు పాండే తెలియజేశారు. మిగిలిన కంపెనీలను ప్రైవేటీకరించడం, విలీనం, ఇతర సీపీఎస్‌ఈలకు అనుబంధ సంస్థలుగా మార్చడం లేదా మూసివేయడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. వెరసి ప్రభుత్వ రంగ కంపెనీలలో భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రయివేట్‌ రంగం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్, కంటెయిన్‌ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్‌ హంస్, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌లో డిజన్వెస్ట్‌మెంట్‌ను వేగవంతం చేయనున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement