వృద్ధిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భాగస్వామ్యం

Global Artificial Intelligence Market Report 2020 - Sakshi

‘అందరికీ ఏఐ’ పేరిట చర్చాపత్రం విడుదల చేసిన నీతి ఆయోగ్‌

అభిప్రాయాలు వెల్లడించేందుకు ఆగస్టు 10 వరకూ గడువు

సాక్షి, అమరావతి: దేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని, దీనివల్ల దేశీయ ఆర్థిక వృద్ధిరేటు 2035 నాటికి ఏటా 1.3 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. ‘టూవర్డ్స్‌ రెస్పాన్సిబుల్‌ – ఏఐ ఫర్‌ ఆల్‌’ పేరిట నీతి ఆయోగ్‌ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. కొన్ని కీలకమైన పరిశోధనలు చేయడానికి కేంద్రం ఫండింగ్‌ చేస్తుండటమే కాకుండా, విశ్వవిద్యాలయాల కరికులమ్‌లో కూడా ఏఐని ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

నిర్వహణలో ఉండే రిస్క్‌ను తగ్గించుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థలతో పాటు, ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వినియోగం భారీగా పెరుగుతోందని పేర్కొంది. ఏఐ వినియోగం వల్ల ఆటోమేషన్‌ పెరిగి చాలా రంగాల ఉద్యోగాలపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఆటోమేషన్‌ వల్ల ఒక్క తయారీ రంగంలోనే కోటి ఉద్యోగాలు, సేవా రంగంలో 30 లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కానీ ఏఐ వినియోగం పెరగడం వల్ల ఆర్థి క వృద్ధిరేటు పెరుగుతుందని, కొన్ని కీలక విభాగాల్లో ఏఐ వినియోగంపై ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ చర్చాపత్రంపై నీతి ఆయోగ్‌ సూచనలు,సలహాలను ఆగస్టు 10లోగా పంపాలని కోరింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top