అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. ప్రముఖ అమెరికన్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘గిట్‌ల్యాబ్’ తన మొత్తం శ్రామిక శక్తిలో ఏకంగా 30 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే, ఒకవైపు గ్లోబల్ స్థాయిలో తొలగింపులు జరుగుతున్నా భారత్‌లో మాత్రం కొత్త నియామకాలకు కంపెనీ మొగ్గు చూపుతుండటం గమనార్హం.
ఏఐ కోసం పునర్నిర్మాణం
జనవరి 2026 నాటికి గిట్‌ల్యాబ్‌లో మొత్తం 2,580 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన 30 శాతం కోత ప్రకారం వందలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీ సీఈఓ బిల్ స్టేపుల్స్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ మార్పులను ధ్రువీకరించారు. ‘ఏజెంటిక్ ఏఐ యుగంలో మాకున్న ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వ్యయ నియంత్రణ ద్వారా వచ్చే పొదుపును తిరిగి ఏఐ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.
ఈ పునర్నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇందులో భాగంగా వాలంటరీ సెవరెన్స్ విండో (స్వచ్ఛంద విరమణ) అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 1, 2026 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్‌పై గిట్‌ల్యాబ్ ఆసక్తి
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నప్పటికీ భారత్‌లో మాత్రం గిట్‌ల్యాబ్ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో భారతదేశానికి సంబంధించి 20కి పైగా ఉద్యోగ ప్రకటనలను కంపెనీ పోస్ట్ చేసింది. అందులో ఫార్వర్డ్ డిప్లాయ్‌డ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, కస్టమర్ సక్సెస్ ఇంజినీర్ వంటి పాత్రలున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ రిమోట్ (ఇంటి నుంచే పని) పద్ధతిలో ఉండటం విశేషం. గిట్‌ల్యాబ్ తన కార్యకలాపాలు సాగించే దేశాల సంఖ్యను తగ్గించుకుని భారత్, అమెరికా వంటి కీలక మార్కెట్లపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
నిజమైన పెట్టుబడా? తొలగింపులకు సాకా?
గిట్‌ల్యాబ్ నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఏఐ ఏజెంట్ల గురించి వ్యాసాలు రాస్తూ, మరోవైపు సిబ్బందిని తొలగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ అన్నట్లుగా.. కొన్ని కంపెనీలు తమ అసమర్థతను దాచుకోవడానికి లేదా ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుతున్నాయా? అనే సందేహాలను నిపుణులు లేవనెత్తుతున్నారు. ‘ఇది వాస్తవంగా ఏఐ కోసం చేస్తున్న మార్పా? లేక 2026లో ఏఐ పేరు చెప్పి చేస్తున్న సాధారణ తొలగింపా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మెటా, అమెజాన్ వంటి దిగ్గజాల బాటలోనే గిట్‌ల్యాబ్ పయనిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా భారత్ వంటి దేశాల్లో నియామకాలు చేపట్టడం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు స్వల్ప ఊరటనిచ్చే అంశం. ఏది ఏమైనా టెక్ ప్రపంచంలో మనుషుల స్థానాన్ని యంత్రాలు (ఏఐ) భర్తీ చేస్తున్నాయా అనే చర్చకు గిట్‌ల్యాబ్ తాజా నిర్ణయం మరింత ఆజ్యం పోసింది.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన


