బ్యాంకుల మార్జిన్లు డీలా | Fitch Warns RBI Liquidity Moves to Pressure Indian Banks Margins in FY27 | Sakshi
Sakshi News home page

బ్యాంకుల మార్జిన్లు డీలా

Apr 3 2026 9:15 AM | Updated on Apr 3 2026 10:43 AM

Fitch Warns RBI Liquidity Moves to Pressure Indian Banks Margins in FY27

రూపాయి హెచ్చుతగ్గుల చర్యల ఎఫెక్ట్‌

లోకల్‌ కరెన్సీ లిక్విడిటీకి ఆర్‌బీఐ దన్ను

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభావం

ఫిచ్‌ రేటింగ్స్‌ తాజా అంచనా 

దేశీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకునే చర్యలతో బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిడి పెరగనున్నట్లు గ్లోబల్‌ దిగ్గజం ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. మరోపక్క రూపాయిలో హెచ్చుతగ్గుల నివారణకు తీసుకునే చర్యలతో లిక్విడిటీ ప్రయత్నాలు మందగించవచ్చని తెలియజేసింది. అయితే బ్యాంకుల ప్రత్యక్ష విదేశీ కరెన్సీ రిసు్కలు మాత్రం పరిమితంకానున్నట్లు అభిప్రాయపడింది. 

ఈ ఆర్థిక సంవత్సరానికి(2026–27) బ్యాంకింగ్‌ రంగ మార్జిన్లు 0.2–0.3 శాతంమేర క్షీణించవచ్చని తెలియజేసింది. పశ్చిమాసియాలో ఆందోళనలు కొనసాగితే నిధుల సమీకరణ వ్యయాలు పెరిగి ప్రస్తుత అంచనాలు 3.1 శాతానికంటేలోపునకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నిర్వహణా లాభ/రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్స్‌(ఆర్‌డబ్ల్యూఏలు) 0.3–0.4 శాతంమేర నీరసించవచ్చని తెలియజేసింది. ప్రస్తుత అంచనాలు 2.5 శాతంలో క్షీణత కనిపించవచ్చని అభిప్రాయపడింది.  

డిపాజిట్‌ వ్యయాలపై..

బేస్‌కేస్‌ ప్రకారం తగినంత లిక్విడిటీ కారణంగా డిపాజిట్‌ వ్యయాలు తగ్గనున్నాయి. 2024 నుంచి ఆర్‌బీఐ కీలక రెపో రేటులో 1.25 శాతం కోత పెట్టినప్పటికీ 2026కల్లా 0.44 శాతమే డిపాజిట్‌ రేట్లకు బదిలీ అయినట్లు ఫిచ్‌ ప్రస్తావించింది. డిపాజిట్లను మించుతున్న రుణ వృద్ధి కారణంగా డిపాజిట్ల సమీకరణలో పోటీ పెరిగినట్లు వెల్లడించింది. వెరసి డిపాజిట్‌ రేట్లలో మరిన్ని సర్దుబాట్లకు అవకాశమున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌లు, ఓపెన్‌ మార్కెట్‌ కొనుగోళ్ల ద్వారా ఆర్‌బీఐ 2024–25 ద్వితీయార్థంలో లిక్విడిటీని నిలకడగా పంప్‌చేసినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీని కొనసాగించేందుకు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు ఆర్‌బీఐ సంకేతాలిచ్చినట్లు తెలియజేసింది. అయితే కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగితే లిక్విడిటీ చర్యలు పరిమితంకానున్నట్లు పేర్కొంది.

పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2026 మార్చి29కల్లా బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ మిగులు డిపాజిట్లలో 0.5 శాతానికి చేరినట్లు వెల్లడించింది. ఫిబ్రవరిలో ఇది 0.8 శాతంకాగా..  రూపాయి సైతం 4.5 శాతం పతనమైనట్లు పేర్కొంది. రూపాయి ఒత్తిళ్లు కొనసాగితే బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ నిలిపేందుకు ఆర్‌బీఐకున్న అవకాశాలు తగ్గిపోనున్నట్లు వివరించింది. ఇందుకు తీసుకునే చర్యలు బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని దెబ్బతీస్తుందని తెలియజేసింది. రూపాయి హెచ్చుతగ్గులు దేశీ బ్యాంకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవని, బ్యాంకింగ్‌ రంగంలో విదేశీ రుణాలు సైతం 10 శాతానికంటే తక్కువేనని తెలియజేసింది. ఈ బాటలోనే తాజాగా 100 మిలియన్‌ డాలర్లకుపైన ఫారెక్స్‌ పొజిషన్లకు తెరవేయమని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది.

ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement