భళా.. భారత్‌, కానీ.. ప్రభుత్వ ఆదాయాలు - వ్యయాల పరిస్థితే బలహీనం!

Fitch affirms Indias sovereign rating on robust growth outlook - Sakshi

స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో‘బీబీబీ మైనస్‌’ రేటింగ్‌ యథాతథం

ప్రభుత్వాల ఆదాయ, వ్యయ తీరు మాత్రం బలహీనం

ఫిచ్‌ తాజా విశ్లేషణ 

న్యూఢిల్లీ: భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ విషయంలో యథాతథ వైఖరిని అవలంభిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ తన తాజా ప్రకటనలో పేర్కొంది. చక్కటి వృద్ధి తీరు, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని నిలబడ్డం వంటి అంశాల నేపథ్యంలో రేటింగ్‌ను స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల విషయంలో పరిస్థితి బలహీనంగా ఉందని కూడా హెచ్చరించింది.

‘బీబీబీ మైనస్‌’ అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌. చెత్త రేటింగ్‌కు ఒక అంచె అధికం. 2006 ఆగస్టు నుంచి ఇదే రేటింగ్‌ను ఫిచ్‌ కొనసాగిస్తోంది. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజాలు– మూడీస్, స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్‌ను ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా దేశంలోకి పెట్టుబడులు రావడానికి ఆయా సంస్థలు ఇచ్చే రేటింగ్స్‌ కీలకం.  ఫిచ్‌ విశ్లేషణలో కొన్ని ముఖ్యాంశాలు..

లాంగ్‌–టర్మ్‌ ఫారిన్‌ కరెన్సీ ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్‌ (ఐడీఆర్‌) స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’గా కొనసాగుతుంది. పటిష్ట వృద్ధి ధోరణి సావరిన్‌ రేటింగ్‌కు మద్దతిస్తున్న ప్రధాన అంశం.  

చెక్కుచెదరని పెట్టుబడుల అవకాశాల నేపథ్యంలో భారత్‌ వృద్ధి 2023 ఏప్రిల్‌–2024 మార్చి (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం) మధ్య 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2022–23లో 7 శాతం వృద్ధి రేటు అంచనాకాగా, 2024–25లో ఎకానమీ స్పీడ్‌ను 6.7 శాతంగా అంచనావేస్తున్నాం.  

తోటి ఎకానమీలతో పోల్చితే భారత్‌ వృద్ధి అవుట్‌లుక్‌ బాగుంది. దీనితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులను తట్టుకునే సామర్థ్యం వల్ల గత ఏడాదికాలంగా పురోగమన బాటలో పయనిస్తోంది.

ప్రభుత్వం మౌలిక రంగంపై పెడుతున్న ప్రత్యేక దృష్టి నేపథ్యంలో  గత కొన్నేళ్లుగా కార్పొరేట్, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌లో సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీనితో ప్రైవేట్‌ రంగం బలమైన పెట్టుబడితో  వృద్ధి బాటపై ఉన్నట్లు కనిపిస్తోంది.  

సేవా రంగ ఎగుమతులకు భారత్‌  మంచి అవకాశాలు పొందవచ్చు.  

గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం సగటును 6.7 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.8 శాతంగా నమోదుకావచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% అప్పర్‌బాండ్‌ కన్నా ఇది 20 బేసిస్‌ పాయింట్లు తక్కువ.

బలహీనతలు ఇవీ..
దేశం కొన్ని బలహీనతలనూ ఎదుర్కొంటోంది. ఆదాయాలు–వ్యయాలు, అధిక లోటు, దీనిని తగ్గించడానికి ప్రభుత్వ వ్యయాల కోత, రుణ భారం, ప్రపంచబ్యాంక్‌ గవర్నెన్స్‌ సూచీలుసహా, జీడీపీ తలసరి ఆదాయంసహా కొన్ని వ్యవస్థాగత సూచీలు ఇక్కడ ప్రస్తావనాంశాలు.

ద్రవ్యోల్బణం సవాళ్లు, పెరుగుతున్న వడ్డీరేట్లు, అంతర్జాతీయంగా డిమాండ్‌ పరిస్థితుల మందగమనం, మహమ్మారికి సంబంధించి సమసిపోని సవాళ్లు– అనుమానాలు వంటివీ ఎకానమీ పురోగతికి సవాళ్లుగా ఉన్నాయి. కార్మిక శక్తి భాగస్వామ్యం ఎకానమీలో ఇంకా బలహీనంగానే ఉంది. సంస్కరణల అమలు బాట ఒడిదుడుకులుగానే ఉంది.

భారత్‌ మార్కెట్‌ అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నప్పటికీ, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి సంబంధించి తగిన సంస్కరణలతో భారత్‌ సంసిద్ధంగా ఉందా? లేదా అన్న అంశంపై అనిశ్చితి నెలకొంది. భారత్‌ ప్రభుత్వ రుణ భారం 2022–23లో 82.8%గా (జీడీపీలో) ఉంటుందని భావిస్తున్నాం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top