ప్రపంచ ప్రఖ్యాత షిప్పింగ్ కంపెనీ 'ఎవర్‌గ్రీన్'కు చెందిన ఒక పెద్ద కార్గో నౌక పెరూ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నౌకలో ఉన్న సుమారు 5,00,000 ఐఫోన్ 17 మొబైల్స్ సముద్రంలో మునిగిపోయాయి. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది?, జరిగిన నష్టం ఎంత అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పెరూలోని ప్రారంభ షిప్పింగ్ లాగ్‌లు & సంబంధిత అధికారుల ప్రకారం.. ఎవర్‌గ్రీన్ నౌక చైనాలోని షెన్‌జెన్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళుతుండగా కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలోనే నౌక పెరూలోని కల్లావో ఓడరేవులో షెడ్యూల్ ప్రకారం ఆగింది. అయితే బలమైన గాలులు, శక్తివంతమైన అలల కారణంగా.. కంటైనర్లు పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 50 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లు సమాచారం.
సముద్రంలో మునిగిపోయిన కంటైనర్లలో.. యాపిల్ ఉత్పత్తులు ఉన్నాయా? అనే విషయంపై అటు యాపిల్ కంపెనీ.. ఎవర్‌గ్రీన్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ కంటైనర్లు దక్షిణ అమెరికా & ఉత్తర అమెరికా మార్కెట్లకు వెళ్లే ఐఫోన్ 17 యూనిట్లతో నిండి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రూ. 4,000 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
ప్రభావం ఇలా..
ఐఫోన్ 17ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 2025లో ప్రారంభించింది. అప్పటి నుంచి వీటికి రికార్డు స్థాయి ఆర్డర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐదు లక్షల ఐఫోన్ 17లు నీటిపాలవ్వడం అనేది బాధాకరమైన విషయం. ఇది ఐఫోన్ 17 డెలివరీలను చాలా ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఉప్పునీటిలో కలిసిపోవడం వల్ల, సముద్రంలోని జలచరాలు కూడా హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి!


