ఇక యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా | EPFO withdrawal via UPI soon: PF money may reach bank accounts in minutes | Sakshi
Sakshi News home page

ఇక యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా

May 20 2026 3:46 AM | Updated on May 20 2026 7:43 AM

EPFO withdrawal via UPI soon: PF money may reach bank accounts in minutes

నేరుగా బ్యాంక్‌ ఖాతాకు జమ 

వాట్సాప్‌ ద్వారా ఖాతా సమాచారం 

త్వరలో అందుబాటులోకి... 

కేంద్ర మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ భవిష్య నిధిని (పీఎఫ్‌) వేగంగా ఉపసహరించుకునేందుకు వీలుగా యూపీఐ పేమెంట్‌ గేట్‌వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని పరీక్షించడం పూర్తయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. మెరుగైన సేవల దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈపీఎఫ్‌వో సభ్యులు యూపీఐ పేమెంట్‌ గేట్‌వే ద్వారా ఉపసంహరించుకునే మొత్తం, వారి బ్యాంక్‌ ఖాతాలకు వెంటనే జమ అవుతుందని చెప్పారు. ఈపీఎఫ్‌ ఖాతాకు లింక్‌ చేసిన యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు భవిష్యనిధిలో కొంత మేర బ్యాలన్స్‌ను తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది.

అది పోను మిగిలిన మొత్తాన్ని యూపీఐ సాయంతో వేగంగా ఉపసంహరించుకునే దిశగా ఈపీఎఫ్‌వో అడుగులు వేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నూతన సదుపాయంతో ఏడు కోట్ల మంది ఈపీఎఫ్‌వో సభ్యులకు నిధుల ఉపసంహరణ సులభతరం కానుంది. ప్రస్తుత విధానంలో సభ్యులు ఉపసంహరణ కోసం క్లెయిమ్‌ దాఖలు చేసి, నిర్ణీత సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది.

ఆటో–సెటిల్‌మెంట్‌ విధానంలో మానవ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్‌ రూపంలో క్లెయిమ్‌ల పరిష్కారానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈపీఎఫ్‌వో వాట్సాప్‌ సేవలను నెలలో ప్రారంభించనున్నట్టు మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. సభ్యులు ఈపీఎఫ్‌వో వాట్సాప్‌ నంబర్‌కు హాయ్‌ అని టైప్‌ చేసి పంపించడం ద్వారా పీఎఫ్‌ ఖాతాలో ఎంత ఉంది? చివరి ఐదు లావాదేవీలు తదితర సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు.  

పెండింగ్‌ కేసులకు పరిష్కారం 
నిధి ఆప్కే నికత్‌ కార్యక్రమం ద్వారా కన్జ్యూమర్‌ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్‌ 1 నాటికి 31,036 కేసులు ఉండగా, 2026 ఏప్రిల్‌ 1 నాటికి 27,639కు తగ్గినట్టు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement