ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్‌ పథకం?

EPCES Urged Govt To Give Tax Refund Scheme For SEZ - Sakshi

ప్రభుత్వానికి ఎగుమతుల ప్రోత్సాహక మండలి విజ్ఞప్తి

మౌలిక రంగం హోదాకూ వినతి    

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ (ఎస్‌ఈజడ్‌) పన్నులు, సుంకాల రిఫండ్‌ పథకం– ఆర్‌ఓడీటీఈపీ (రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్టెడె ప్రొడక్ట్స్‌) ప్రయోజనాలను వర్తింపజేయాలని ఈఓయూ, ఎస్‌ఈజడ్‌ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీఈఎస్‌) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్‌ జరుగుతుంది.  అలాగే ఈ రంగానికి మౌలికరంగం హోదా ఇవ్వాలని కోరింది. తద్వారా ప్రాధాన్యత రంగం కింద తక్కువ రేటుకు ఎస్‌ఈజడ్‌లకు బ్యాంకుల నుంచి రుణాల మంజూరు సాధ్యమవుతుందని పేర్కొంది. 
పెరుగుతున్న ఎగుమతులు
జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్‌ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఈపీసీఈఎస్‌ చైర్మన్‌ భువనేష్‌ సేథ్‌ ఆయా అంశాలపై మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 2020–21లో ఎస్‌ఈజడ్‌ ఎగుమతుల  విలువ రూ.7.55 లక్షల కోట్లుకాగా, 2021–22లో ఈ విలువ రూ.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా కోవిడ్‌ ముం దస్తు ఎగుమతుల విలువ (2019–20లో రూ.7.84 లక్షల కోట్లు)ను ఈ విభాగం అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయన్నారు.  ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి నౌకాశ్రయాలకు రవాణా సౌలభ్యతపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.  
ఆర్‌ఓడీటీఈపీ వివరాలు ఇవీ.. 
ఆర్‌ఓడీటీఈపీ స్కీమ్‌ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, కేంద్రం ఇటీవలే ఆర్‌ఓడీటీఈపీ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్‌ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్‌కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్‌ రేట్లను కూడా  కేంద్రం నోటిఫై చేసింది. వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్‌ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్‌ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్‌ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్‌ ఎక్సైజ్‌పన్ను వంటి విభాగాల్లో  రిఫండ్స్‌ జరుగుతాయి.  రిఫండ్‌ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి.  స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్‌ఓడీటీఈపీ పథకం వర్తించదు. ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణం. జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ  కేంద్రం ఇటీవలే ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్‌ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది.  
ఎస్‌ఈజడ్‌లవైపు 
దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్‌ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్‌ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎస్‌ఈజడ్‌ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి  ప్రధాన కారణం. దేశం  ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం.   
నేడు కొత్త కార్యాలయం ప్రారంభం 
దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిమాలయ భవన్‌లో ఈపీసీఈఎస్‌ కొత్త కార్యాలయం సెప్టెంబర్‌ 8వ తేదీన ప్రారంభమవుతుందని  చైర్మన్‌  భువనేష్‌ సేథ్‌ తెలిపారు. వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్, వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యంలు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘ఎగుమతులు పెంపు, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక వినియోగం, నూతన ఆవిష్కరణలు– ఎస్‌ఈజడ్‌లపై ప్రభావం’ అన్న అంశంపై పీడబ్ల్యూసీ నిర్వహించిన ఒక అధ్యయన నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరుగుతుందని కూడా ఆయన వెల్లడించారు. 

చదవండి : గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top