
ఈసారి రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇంచుమించు కోటి దాకా రిటర్నులు వేసినట్లు అంచనా. అందులో చాలా మంది వెరిఫై కూడా చేశారు. గతంలో రిటర్ను వేసిన ఒకటి, రెండు రోజుల్లో రిఫండ్ వచ్చేసిన కేసులున్నాయి. సాధారణంగా 20 నుంచి 45 రోజుల్లోపల మీ బ్యాంకు ఖాతాకి రిఫండ్ మొత్తం జమ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో జాప్యం జరగొచ్చు.
ఏ కారణం వల్ల రిఫండ్ త్వరగా రాదంటే..
చాలా మంది వెరిఫై చేయడం లేదు. ఇలా వెరిఫై చేయనంతవరకు రిటర్నులను ముట్టుకోరు. ప్రాసెస్ చెయ్యరు. అందుకని రిటర్నులను వేసిన వెంటనే వెరిఫై చేయడం మరిచిపోవద్దు.
బ్యాంకు అకౌంట్ వివరాలు పూర్తిగా ఇవ్వకపోతే రిఫండు రాదు. బ్యాంకుల విలీనం వల్లో, అడ్రెస్సులు పోవడం వల్లో, కోడ్‌లలో వచ్చిన మార్పులను తెలియచేయకపోవడం వల్లో కూడా ఇలా జరగొచ్చు. బ్యాంకు అకౌంటు నంబరు ఇప్పుడు పొడుగ్గా ఉంటోంది. ఏ ఒక్క అంకె తప్పొచ్చినా, సమాచారం లోపం వల్ల జమ ఆగిపోతుంది.
పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే .. మిస్‌మ్యాచింగ్. రిటర్నుల్లో దాఖలు చేసిన అంశాలు, అన్నీ పూర్తిగా 26 ఏఎస్, ఏ19తో సరిపోయి ఉండాలి. 26ఏఎస్, ఏఐఎస్, ఈ రెండూ ఆదాయపు పన్ను వెబ్‌సైట్లో దొరుకుతాయి. ఇవి చాలా స్పష్టంగా మీకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి చూపిస్తాయి. సర్వసాధారణంగా తప్పులు ఉండవు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, వీటిలో సమాచారం బేస్‌గా రిటర్నులు వేసేస్తుంటారు. అ ప్పుడు మిస్‌మ్యాచ్ ఉండదు. ఇదొక సేఫ్ గేమ్. అలా అని మీరు 26ఏఎస్, ఏఐఎస్ అంశాలతో పూర్తిగా ఏకీభవించాలని లేదు. అందులోని అంశాలు తప్పని అనిపించినా, రెండు సార్లు కనిపించినా, మీవి కాకపోయినా, మీరు విభేదించవచ్చు. అప్పుడు, మిస్‌మ్యాచ్ తథ్యం. ఇలాంటప్పుడు రిఫండు ఆలస్యం అవుతుంది.
కొంత మంది ఫారం ఎంచుకోవడంలో పొరపా టు చేస్తారు. అలాంటి పొరపాటు జరిగినా, రి ఫండు ఆలస్యం కావచ్చు. జాగ్రత్త వహించాలి.
సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమవ్వొచ్చు. ఇవి తాత్కాలికం కావొచ్చు. తాత్కాలికం అయితే, గంటలోనో లేదా రోజులోపలో దానంతట అదే సాల్వ్ అయిపోతుంది. కొన్ని వారం, పది రోజులు పట్టొచ్చు. అధికార్లకు ఈ సమస్య తెలియకపోవచ్చు. సిస్టమ్ అధికార్లకు కూడా వెనువెంటనే తెలియదు. ఈ మేరకు ప్రాసెసింగ్ లేటు అవుతుంది.
పన్నులు చెల్లింపుల మూడు రకాలు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్. ఈ చలాన్లలోని అంశాలు రాసేటప్పుడు ఏ పొరపాటు జరిగినా .. చెల్లింపులకు సంబంధించిన పద్దు, గవర్నమెంటు ఖాతాలో మీ పేరున జమ అవ్వదు. సస్పెన్స్‌లో పెడతారు. దాన్ని పట్టుకోవడం సులువైన పని కాదు. అలాగే టీడీఎస్ రికవరీలు, చెల్లింపులు, రిటర్నులు వేయడం – ఈ మూడు దశల్లో ఎక్కడ తప్పు జరిగినా, పెండింగ్‌లో పడిపోతుంది. అటు పక్క వ్యక్తి తప్పులు చేసినా మీరే సఫర్ అవుతారు. చెక్ చేసుకోండి. ఇలాంటి సమస్యల వల్ల రిఫండ్ ఆగిపోతుంది.
పాత/ముందు సంవత్సరాల్లో చెల్లించాల్సిన బకాయిలుంటే వాటిని రికవరీ చేయడం వల్ల ప్రస్తుత సంవత్సరపు రిఫండ్ ఆగిపోవచ్చు. ఈ మధ్య ఓ కేసులో 18 ఏళ్ల క్రితం ఉన్న బకాయిల నిమిత్తం నోటీసులు ఇచ్చారు. కాగితాలు సకాలంలో దొరక్కపోవటం వల్ల జవాబు ఇవ్వలేదు. ఆ సంవత్సరం బకాయిల నిమిత్తం కరెంటు రిఫండును తొక్కి పెట్టేశారు. వాళ్లకి వాళ్లు పన్నులను రికవర్ చేసుకోవడానికి ఎంత వెనక్కయినా వెళ్తారు. మన కష్టాలు పట్టించుకోరు. అందుకనే అన్ని సంవత్సరాల రికార్డులూ భద్రంగా దాచిపెట్టుకోవాలి. అశ్రద్ధ వద్దు. రికవరీ చేసుకున్నామని మీకు చెప్పరు కూడా.
ఇక అధికార్ల వద్ద మరో బ్రహ్మాస్త్రం ఉంటుంది. అదే స్క్రూటినీ ప్రొసీడింగ్స్. ఏదైనా కారణాల వల్ల మీ కేసు స్క్రూటినీకి ఎంపిక అయిందనుకోండి. అధికార్లు ఆరా తీస్తారు. ఆరాలో తొక్క తీస్తారు. తొక్క తీసి తోలు కడతారు. అలా అయ్యేవరకు రిఫండ్ రాదు. అలాగని స్క్రూటినీ అంటే భయపడక్కర్లేదు కానీ, జాప్యం ఎక్కువ జరగొచ్చు. అనిశ్చితి .. అయోమయం పరిస్థితి నెలకొనవచ్చు.
ఈ సంవత్సరానికి గాను గతంలోలాగా వెనువెంటనే రిఫండులు జారీ చేయడం లేదు. ఒకటికి పది సార్లు చెక్ చేసి, గతానికి వెళ్లి, అన్ని చేక్ చేసి కానీ రిఫండులు ఇవ్వడం లేదు. అలా అని మీరేమీ గాభరాపడక్కర్లేదు.
